దేశప్రజల్లో దేశ భక్తిని మరింత పెంపొందించడానికి బీజేపీ రెడీ అయిపోయింది. ఎన్నికలకు ముందు ఇది చాలా అత్యవసరం కాబట్టి… ఈ విషయంలో గ్రౌండ్ ప్రిపేర్ చేస్తోంది. పాక్ ఆక్రమిత కశ్మీర్ కేంద్రంగా ప్రజల్లో దేశబక్తిని నింపి.. ఓట్ల గుద్దుడుకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్లుగా తాజా పరిణామాలు సూచిస్తున్నాయి. ఇటీవల కేంద్ర రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ . ..హఠాత్తుగా పాకిస్తాన్ పై విరుచుకుపడుతున్నారు. ఆయన మాటలు సినిమా డైలాగుల్లా సూటిగా స్పష్టంగా.. తమ లక్ష్యం ఏమిటో చెప్పేలా ఉన్నాయి.
భారత్ లో ఉన్నది గతం లాంటి ప్రభుత్వం కాదని.. సరిహద్దు దాటి వచ్చి కొడతామని పాకిస్తాన్ ను హెచ్చరించారు. గతంలో సర్జికల్ స్ట్రైక్స్ మోదీ ఐదు నిమిషాల్లోనే అనుమతి ఇచ్చారన్నారు. పాక్ ఆక్రమిత కశ్మీర్ పై ఆశలు వదిలేసుకోవాలని.. అక్కడి ప్రజలంతా ఇండియాలో కలవాలనుంటున్నారని స్పష్టం చేశారు పీఓకేని భారత్లో కలపాలని ప్రజల నుంచి పెద్ద ఎత్తున డిమాండ్ ఉందని ఆయన అంటున్నారు.
పీఓకే భారతదేశంలో అంతర్భాగమని భారత పార్లమెంటులో ఏకగ్రీవ తీర్మానం ఆమోదించబడిందని, జమ్మూ కశ్మీర్లో ఎక్కువ భాగం పాకిస్థాన్ ఆక్రమితంలో ఉందన్నారు. జమ్మూ కశ్మీర్ లో ప్రజలు ప్రశాంత జీవనం గడుపుతుంటే, పీవోకేలో ప్రజలు ఎన్నో బాధలు ఎదుర్కొంటున్నారన్నారు. వారు భారత్ తో ఉండాలనే డిమాండ్ చేస్తున్నారన్నారు. రాజ్ నాథ్ వ్యాఖ్యలు.. దేశంలో మారుతున్న రాజకీయ పరిణామాలు చూస్తే.. వచ్చే ఎన్నికల కంటే ముందే పీవోకేలో ఏదో ఒకటిచేసి.. ప్రజల్లో దేశభక్తిని బీజేపీ పెంచడం ఖాయమన్న అంచనాలు వినిపిస్తున్నాయి.