తెలంగాణ సీఎం కేసీఆర్ సోమవారం 600 వాహనాలతో షోలాపూర్ లో బలప్రదర్శన చేయడంపై మహారాష్ట్రలో భిన్నమైన చర్చ జరుగుతోంది. పొరుగు రాష్ట్ర సీఎంగా సంబంధాలు మెరుగుపర్చుకోవడానికి వస్తే సరే కానీ ఇలా దండయాత్రలాగా రావడం.. బలప్రదర్శన చేయడం ఏమిటన్న చర్చను అక్కడి రాజకీయ పార్టీలు పెడుతున్నాయి. ఈ అంశంపై శివసేన ఉద్దవ్ థాక్రే వర్గం, ఎన్సీపీ అధినేత శరద్ పవార్ అసహనం వ్యక్తం చేస్తున్నారు.
కేసీఆర్ ప బలాన్ని చూపించడానికి ఈ ప్రయత్నంచేయడం ఆందోళనకరమని శరద్ పవార్ వ్యాఖ్యానించారు. పొరుగు రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రార్థనలు చేయడానికి వస్తే, అభ్యంతరం చెప్పాల్సిన అవసరం లేదని అన్నారు. కానీ వాహనాల సంఖ్య పరంగా బలాన్ని ప్రదర్శించే ప్రయత్నం ఆందోళన కలిగించిందని అన్నారు. సీఎం కేసీఆర్ పర్యటన రెండు రాష్ట్రాల మధ్య సహకారాన్ని పెంపొందించడంపై దృష్టి సారించి ఉంటే బాగుండేదని పవార్ అన్నారు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఎన్నికైన 9 ఏళ్లలో, అంతకు ముందు ఏపీ మంత్రిగా, కేంద్ర మంత్రిగా ఒక్కసారి కూడా పండరీపురాన్ని సందర్శించలేదని ఉద్దవ్ శివసేన వర్గం నేత రౌత్ గుర్తు చేశారు. కేసీఆర్ ఎవరికి తన బలాన్ని ప్రదర్శించాలని చూస్తున్నారని ప్రశ్నించారు.
స్థానికత అనేది మహారాష్ట్ర రాజకీయాల్లోనూ కీలక పాత్ర పోషిస్తుంది. శివసేన ఆ విషయంలో పీహెచ్డీ చేసింది. అందుకే ఇప్పుడు తమ రాష్ట్రంపైకి కేసీఆర్ దండెత్తున్నారన్న అభిప్రాయాన్ని వారు వ్యక్తం చేస్తున్నారు. తాము తెలంగాణలో అలా బలప్రదర్శనకు వస్తే ఎలా ఉంటుందని వారు ప్రశ్నిస్తున్నారు. త్వరలో అలాంటి పరిస్థితి రావొచ్చని అంటున్నారు. కొసమెరుపేమిటంటే గతంలో.. తాము మహారాష్ట్రలో రాజకీయాలు చేస్తే తన్ని తరిమేస్తారని గతంలో కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.