వైసీపీ ఎమ్మెల్యేలకు ఇంటా బయటా టార్చర్ తప్పడం లేదు. సీఎం జగన్మోహన్ రెడ్డి ఇంటింటికి వెళ్లాల్సిందేనని ఒత్తిడి చేస్తున్నారు. వెళ్తేనమో ప్రజలు అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక ఎమ్మెల్యేలు కంట్రోల్ తప్పి పోతున్నారు. ఈ సారి స్పీకర్ తమ్మినేని సీతారాంకే ఇలాంటి పరిస్థితి ఎదురయింది. దీంతో ఆయన దిక్కున్న చోట చెప్పుకోపో అని ఓటర్ ను..అదీ కూడా మహిళా ఓటర్ ను అనేశారు. ఇప్పుడీ వీడియోలు వైరల్ అవుతున్నాయి. తమ్మినేని అసలే షార్ట్ టెంపర్. నిలదీస్తే తట్టుకోలేకపోతున్నారు.
తమ్మినేనిది లెటెస్ట్ . .. కానీ గడప గడపకూ ప్రారంభమైనప్పటి నుండి ఎమ్మెల్యేలకు అదే టార్చర్. ప్రజలు నిలదీస్తూంటే కేవలం లబ్దిదారుల ఇళ్లకే వెళ్లాలని ఎమ్మెల్యేలు అనుకున్నారు. అంతే వెళ్తున్నాు. గ్రామ, వార్డు సచివాలయాలు.. వాలంటీర్ల ద్వారా లబ్దిదారుల జాబితాలను ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇంచార్జులు.. ఇతర నేతలకు పంపించారు. ఆ ప్రకారమే వారు గడపగడపకూ బయలుదేరారు. అయితే పథకాలు తీసుకున్న వారు కూడా రకరకాలుగా ప్రశ్నిస్తున్నారు. రూ. పదివేలు ఇచ్చి.. రూ. ఇరవై వేలు లాక్కుంటున్నారని అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇంట్లో మద్యం తాగేవారుంటే రియాక్షన్ మరో స్థాయిలో ఉంటోంది. ప్రభుత్వం మా రక్తం తాగుతోందని ఆ కుటుంబీకులు ఫైరవుతున్నారు.
ప్రజలు నిలదీయకూడదనే చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. కానీ జరగాల్సినవి జరిగిపోతున్నాయి. అసలు వెళ్లకుండా ఉండాలని చాలా మంది అనుకుంటున్నారు. కానీ ఐ ప్యాక్ సభ్యులు ఎమ్మెల్యేలు వెళ్తున్నారా లేదా అని రిపోర్టులు ఇచ్చి .. జగన్ తో హెచ్చరికలు జారీ చేయిస్తున్నారు. దీంతో వెళ్తే జనం.. వెళ్లకపోతే జగన్ టార్చ్ర్ పెడుతున్నారని వారు అసహనానికి గురవుతున్నారు.