తెలంగాణ బీజేపీ వ్యూహాత్మకమైన తప్పిదాలు చేసి … కొట్టుకున్న గాలి మొత్తాన్ని తీసేసుకుని చల్లబడిపోయింది. అయినా ప్రయత్నాలు మాత్రం ఆపకూడదని అనుకుంటోంది. బీజేపీ ప్రతి రాష్ట్రంలో ఎన్నికలకు ముందు.. విస్తారక్ల పేరుతో ఆ రాష్ట్రానికి సంబంధం లేదని వందల మందిని పోలింగ్ బూత్‌ల దగ్గర ప్రచారానికి పంపుతుంది. అలా అహ్మదాబాద్ నుంచి ఆరు వందల మందిని తెలంగాణకు పంపించారు. వీరంతా తెలంగాణకు చేరుకున్నారు. తమకు కేటాయించిన పోలింగ్ బూత్‌ల పరిధిలో పని చేయడం ప్రారంభించారు.
ఈ విస్తారక్‌లు 35 ఏళ్ల లోపు వారే ఉంటారు. పార్టీ పట్ల నిబద్దతగా ఉంటారు. ప్రతి పోలింగ్ బూత్ పరిధిలో నేతల్ని వెంటబెట్టుకుని వెళ్లి ఓటర్లను కలుస్తారు. వారి ఫీడ్ బ్యాక్ ను పూర్తి స్థాయిలో తీసుకుంటారు. వీలైనంతగా ప్రచారం చేస్తారు. చివరికి నివేదికల్ని హైకమాండ్ కు సమర్పిస్తారు. వీరు ఎక్కడ తిరుగుతారో అక్కడి పరిస్థితిని వివరిస్తారు. నేతల పనితీరును.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పని తీరు గురించి తెలుసుకుంటారు. ఓ రకంగా సర్వే చేస్తారన్నమాట.
బీజేపీ తెలంగాణలో గెలవాలంటే ఏం చేయాలన్నదానిపై ఈ ఆరు వందల మంది ఫీడ్ బ్యాక్ తీసుకుని.. హైకమాండ్ కు సమర్పిస్తే.. వారు తదుపరి వ్యూహాలు అమలు చేసే అవకాశాలు ఉంటాయి. కానీ ఇప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయిందని.. ఎంత మందిని తీసుకొచ్చి ప్రచారం చేసినా ఏం ప్రయోజనమన్న నిరాశ బీజేపీ నేతల్లో కనిపిస్తోంది.