జనసేన అధినేత పవన్ దూకుడు వైసీపీని కంగారు పెడుతోంది. కాపు వర్గం ఓట్లన్నింటిని ఆయన కన్సాలిడేట్ చేస్తున్నారని ఆందోళన పెరగడంతో తనదైన శైలిలో ఆ వర్గంపై విశ్వరూపం ప్రదర్శించడానికి సిద్ధమయింది. వ్యాపారాలున్న కాపు ప్రముఖుల్ని టార్గెట్ చేసుకుని పార్టీలో చేరతారా.. చస్తారా అన్న సందేశాన్ని పంపుతోంది. ఇప్పటికి ఈ దిశగా చాలా మందితో మంతనాలు చేస్తున్నారు. త్వరలో చేరికలు ఉంటాయని చెబుతున్నారు. రాయలసీమతో పాటు ఉభయగోదావరి జిల్లాల్లోకాపు నేతలపై ఎక్కువ దృష్టి పెట్టారు.
ఏపీలో విద్యా సంస్థలు, వ్యాపారాలు ఉన్న కాపు ప్రముఖుల్ని ప్రధానంగా టార్గెట్ చేశారు. ఇతర పార్టీల సానుభూతి పరులుగా ఉన్నప్పటికీ.. తమ పార్టీలోకి రావాల్సిందేనని హెచ్చరిస్తున్నారు . వ్యాపారం చేసుకుంటారా .. .. నష్టపోతారా అన్న సందేశం వారికి వెళ్తోంది. ఇక వైసీపీ ప్రధాన ఆయుధం భయపెట్టడం. ఆస్తులు ధ్వంసం చేస్తామని.. కుటుంబానికి గ్యారంటీ ఉండదని ఇర రకరకాలుగా వేధిస్తూంటారు. తాజాగా కర్నూలు జిల్లాలో ఓ సర్పంచ్ .. తనను పార్టీలో చేరకపోతే చంపేస్తామంటున్నారని రిలీజ్ చేసిన వీడియో సంచలనం అవుతోంది.
అయితే ఇలా కాపు ప్రముఖులపై వేధింపులకు పాల్పడితే వచ్చే ఓట్లు కూడా రావని.. బెదిరించి పార్టీలో చేర్చుకుంటే వారు పార్టీ కోసం ఎలా పని చేస్తారన్న ప్రశ్నలు సహజంగానే క్యాడర్ నుంచి వస్తున్నాయి. ప్రజలకు మేలు చేస్తే వారే ఓట్లు వేస్తారని.. ఇలా బెదిరింపులకు పాల్పడటం ద్వారా మొదటికే మోసం వస్తుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే వైసీపీ హైకమాండ్ స్టైలే వేరు. సామ, భేద, దాన ఉపాయాలను పక్కన పెట్టి.. నేరుగా దండోపాయంతోనే పనులు చేయాలనుకుంటూ ఉంటుంది.