విశాఖ అచ్యుతాపురం సెజ్‌లో ఉన్న సాహితి ఫార్మా కంపెనీలో రెండు రియాక్టర్లు పేలిపోయాయి. పలువురు కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. ఇద్దరు చనిపోయారని చెబుతున్నారు. ఈ కంపెనీ రియాక్టర్ల పేలుడు రెండు కిలోమీటర్లవరకూ వినిపించింది. ఎగసిపడిన మంటలు కిలోమీటర్ దూరం వరకూ వినిపించాయి. మంటల్ని అదుపు చేయడానికి వచ్చిన అగ్నిమాపక సిబ్బంది కూడా గాయపడ్డారు. అయితే ఈ ప్రమాద తీవ్రతను తగ్గించి చూపించడానికి ఏపీలో ఓ వర్గం మీడియా చేసిన ప్రయత్నం అంతా ఇంతా కాదు. ఫార్మా సెజ్ లో ప్రమాదాలు ఇటీవలి కాలంలో తరచూ జరుగుతున్నాయి. అయినా తీసుకుంటున్న చర్యలు శూన్యం.
వైసీపీ ప్రభుత్వం వచ్చిన కొత్తలో ఎల్జీ పాలిమర్స్ ప్రమాదం జరిగినప్పుడు అసలు రాష్ట్రంలో ఉన్న పరిశ్రమలన్నింటినీ సెక్యూరిటీ ఆడిట్ చేస్తామని హడావుడి చేశారు. చివరికి కంపెనీల దగ్గర విరాళాలు తీసుకుని తూ తూ మంత్రం పూర్తి చేశారన్న ఆరోపణలు వచ్చాయి. ఆ తర్వాత జరిగిన ప్రమాదాలు లెక్కలేనన్ని ఉన్నాయి. విశాఖలోనే ప్రతీ వారం ఓ ప్రమాదం జరుగుతోంది. కానీ పట్టించుకుంటున్న వారు మాత్రం లేరు. పని చేస్తున్న కార్మికులే బలి పశువులు అవుతున్నారు.
ఓ వైపు విశాఖలో రియల్ ఎస్టేట్ మాఫియా జడలు విప్పిందని వరుసగా జరుగుతున్న కడ్నాప్ వ్యవహారాలతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. కబ్జాలు, సెలిట్మెంట్ల కోసం ఎక్కడెక్కడ వైసీపీ నేతలంతా విశాఖలో వాలిపోతున్నారు. చివరికి మహిళా కమిషన్ చైర్మన్ వాసిరెడ్డి పద్మ కూడా అదే పనిలో ఉన్నట్లుగా ఆరోపణలు రావడం.. వైసీపీలో ప్రతీ స్థాయి నేత విశాఖపై కన్నేశారన్న అభిప్రాయానికి వచ్చేలా చేస్తున్నాయి. ఓ వైపు నేరాలు.. మరో వైపు ప్రమాదాలు.. విశాఖ నగర ప్రజల్ని వణికిస్తున్నాయి.