వైసీపీ అధినేత జగన్ రెడ్డి పాలనలో బడా రెడ్లకు వేల కోట్ల బిల్లులు వస్తాయి కానీ కింది స్థాయి ప్రజలకు మాత్రం పైసా ప్రయోజనం ఉండదు. పైగా వారి ఆస్తులకు కూడా గ్యారంటీ ఉండదు. చివరికి సామాన్యులైన రెడ్లకు కూడా. కడప జిల్లాలో వెంకటసుబ్బారెడ్డి అనే రైతు నేరుగా సీఎం జగన్ పేరు రాసి ఆత్మహత్య చేసుకున్నారు. ఇక ఆయన తన సమస్యకు పరిష్కారం దొరకదని.. దొరికినా చేయరని అర్థమైపోయి.. ఇదంతా జగన్ రెడ్డి వల్లేనని తీర్మానించుకుని ఆయన పేరు రాసి ఆత్మహత్య చేసుకున్నారు.
నేరుగా జగన్ పేరు రాసేంత పరిస్థితి ఎందుకు వచ్చిందో అర్థం చేసుకోవడం పెద్ద విషయం కాదు. ఇటీవలి కాలంలో రాయలసీమలో రెడ్డి సామాజికవర్గ రైతులు చాలా మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఎక్కువ మందివి భూ సమస్యలే. వారంతా సీఎం జగన్ పేరు రాయకపోవచ్చు కానీ.. కారణం మాత్రం ప్రభుత్వమే. గతంల ఓ వాలంటీర్ .. సీఎం జగన్ పేరు రాసి మరీ ఆత్మహత్య చేసుకున్నారు. పరిపాలనలో ప్రచారానికి … నిజానికి హస్తిమశకాంతరం తేడా ఉందని ఇలాంటి ఆత్మహత్యలే తరచూ నిరూపిస్తూ ఉంటాయి. కానీ ప్రభుత్వంలో మాత్రం చలనం ఉండంటం లేదు.
పరిపాలన అనేది అందరికీ సమానంగా ప్రయోజనం కల్పించాలి. కానీ దురదృష్టవశాత్తూ ఏపీలో ఒక్క వర్గానికే ప్రాధాన్యం ఇస్తున్నారు. అదీ కూడా పలుకుబడి ఉన్న వారికే. కింది స్థాయిలో అందరూ సమిధలవుతున్నారు. ప్రజా సమస్యలను ప్రశ్నించిన ప్రతి ఒక్కరూ ఇతర పార్టీల వాళ్లే అనుకోవడం.. అన్నట్లుగా ప్రచారం చేయడం తప్పితే… అసలు సమస్యను పరిష్కరించే ఆలోచన చేయకపోవడమే పెద్ద లోపం. దీనికి తప్పు పట్టాల్సింది ఎవరిని ?