వైసీపీ మద్దతుదారులకు .. నమ్మిన వాళ్లను మోసం చేయడం అంటే వెన్నతో పెట్టిన విద్యలా మారిపోయింది. చివరికి సాధ్యం కాదని తెలిసి జీవోలిచ్చి… మళ్లీ ఉపసంహరించుకుని… జీవోలు వెనక్కి తీసుకున్నా.. అందులో ఉన్నవన్నీ అమలవుతాయని కథలు చెబుతున్నారు. సచివాలయ ఉద్యోగుల సంఘం వెంకట్రామిరెడ్డి ఇప్పుడు ఇదే చేస్తున్నారు.
ఈ ఏడాది జనవరి 13న జీవో నంబర్ 121 ద్వారా సచివాలయంలోని 50 మంది సెక్షన్ ఆఫీసర్లకు అసిస్టెంట్ సెక్రటరీలు గా ప్రభుత్వం ప్రమోషన్లు ఇచ్చింది. ఆ యాభై మంది ప్రమోషన్లకు అర్హులు కాదు. అయినా నిబంధనలు ఉల్లంఘించారు. వెంకట్రామిరెడ్డి ఉద్యోగ సంఘం ఎన్నికల్లో గెలవడానికి ఇలా ప్రమోషన్లు ఇప్పిస్తానని హామీ ఇచ్చారు. ఆ హామీ ప్రకారం ఒత్తిడి పెరగడంతో ఆయన జీవో ఇప్పించారు. కానీ నష్టపోయిన ఇతర ఉద్యోగులు కోర్టుకెళ్లారు. సుప్రీంకోర్టు ఉత్తర్వులను ఈ జీవోతో ధిక్కరించారని హైకోర్టు సీరియస్ అయింది. దీంతో జీవో 121ని ప్రభుత్వం ఉపసంహరించుకుంది. ఆ 50 మంది ఉద్యోగుల ప్రమోషన్లను ఆపేస్తున్నట్టు ఆదేశాలిచ్చింది.
ఉద్యోగుల్ని అడ్డగోలుగా మోసం చేసి.. తప్పుడు జీవోలు ఇప్పించిన వెంకట్రామిరెడ్డి ఇప్పుడు కథలు చెబుతున్నారు. 50 మంది ప్రమోషన్ ప్రకారం వచ్చిన పోస్టుల్లోనే ఉండాలని వెంకట్రామిరెడ్డి చెబుతున్నారు. కోర్టులో సరిగ్గా వాదించలేకపోవడం వల్లే ఇలాంటితీర్పు వచ్చిందని.. దీనిపై కోర్టుకు వెళ్లి స్టే తెస్తామని చెబుతున్నారు. జీవో నిలుపుదల కోర్టులో చూపించడానికేనని చెబుతున్నారు. అయితే .. మేము మరీ అంత వెధవల్లాగా కనిపిస్తున్నామా అని ఇతర ఉద్యోగులు ఆయన వైపు విచిత్రంగా ఉన్నారు. అసలు కొసమెరుపేమిటంటే…ఈ ప్రమోషన్ పొందిన వారిలో వెంకట్రామిరెడ్డి కూడా ఉన్నారు.