నాగశౌర్య లేటెస్ట్ సినిమా `రంగబలి`. వచ్చే వారం విడుదల. ఈ సినిమా కోసం చిత్ర బృందం ఓ ప్రమోషనల్ వీడియో చేసింది. దాని టీజర్ టాలీవుడ్ ని షేక్ చేసేసింది. టాలీవుడ్ లోని కొంతమంది ప్రముఖ జర్నలిస్టులు, వారి ఇంటర్వ్యూ శైలిని సత్య అనుకరిస్తూ చేసిన ఇంటర్వ్యూ ఇది. ప్రోమోలో సత్య హావభావాలూ, తన బాడీ లాంగ్వేజ్ భలే కుదిరిపోయాయి. సదరు జర్నలిస్టులపై బాగానే సెటైర్లు పడ్డాయి. ఫుల్ ఇంటర్వ్యూ కోసం అందరూ ఎదురు చూస్తున్న సమయంలో.. ఆ ఇంటర్వ్యూని తీసుకెళ్లి డస్ట్ బిన్లో పడేశారు. ఇప్పుడు పూర్తి ఇంటర్వ్యూ బయటకు రావడం లేదు.
రంగబలి ప్రోమో ఇంటర్వ్యూ కోసం సత్య ఇమిటేట్ చేసిన ప్రముఖ జర్నలిస్టుల్లో ఏబీఎన్ రాధా కృష్ణ ఒకరు. మిగిలిన వాళ్ల మాటెలా ఉన్నా, ఓ మీడియా సంస్థ అధినేతని ఇలా ఇమిటేట్ చేయడం ‘రంగబలి’ని ఇబ్బంది పెట్టే వ్యవహారమే. చేసింది సరదాకే అయినా, దాని ఇంపాక్ట్ వేరే స్థాయిలో పడే ప్రమాదం ఉంది. అందులోనూ లేడీ గెటప్ తో సత్య ఇమిటేట్ చేయడం.. సదరు జర్నలిస్ట్ డీప్‌గా డిస్ట్రబ్ అయినట్టు టాక్. ఈ విషయం చిత్ర బృందానికి తెలియడంతో ముందస్తు జాగ్రత్తగా – ఆ పూర్తి వీడియోని పక్కన పెట్టేశారని తెలుస్తోంది. పూర్తి వీడియో డిలీట్ చేసినా, రంగబలికి రావల్సిన బజ్ మాత్రం ఈ బుల్లి ప్రోమో రూపంలో వచ్చేసింది. కాబట్టి.. రంగబలి స్ట్రాటజీ వర్కవుట్ అయినట్టే.