ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఏదో చేయాలనుకుంటున్నారు కానీ ధైర్యం చాలడం లేదన్నట్లుగా పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఢిల్లీ పర్యటనకు వెళ్లి కేంద్రమంత్రులు, ప్రధానితో భేటీ అయి వచ్చి న తర్వాత మంత్రి వర్గ సమావేశం ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో ఏం నిర్ణయాలు తీసుకుంటారన్నది మాత్రం స్పష్టత ఉండటం లేదు. కేబినెట్ నిర్ణయాలు కూడా చాలా వరకూ సీక్రెట్ గానే ఉంటున్నాయి. ఆస్తులు తాకట్టుపెట్టడం, ఇతరులకు కేటాయించడం వంటివి చివరి క్షణం వరకూ బయటకు రావడం లేదు.
కావాలనుకున్నవి మాత్రం లీక్ చేస్తున్నారు. గత ఢిల్లీ పర్యటన తర్వాత కూడా సీఎం జగన్ కేబినెట్ భేటీ ఏర్పాటు చేశారు. అప్పట్లోనే తెలంగాణతో పాటు ఎన్నికలకు వెళ్లే దిశగా సంకేతాలు ఇస్తారేమో అనుకున్నారు. కానీ ఇవ్వలేదు. అయితే ఏపీలో మాత్రం ఆయన బీజేపీతో అవగాహనకు ఇప్పటికే వచ్చారని.. ఆగస్టులో అసెంబ్లీని రద్దు చేసి ఎన్నికలు పెట్టేలా చూసుకున్నారని అంటున్నారు. ఈ విషయంపై తనకు స్పష్టత ఉందని జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ కూడా చాలా సార్లు ప్రకటించారు.
ఈ ఏడాదికి కేంద్రం ఇచ్చిన అప్పుల పరిమితికి దాదాపుగా ముగిసింది. వచ్చే నెల నుంచి జీతాలివ్వడం మరింత కష్టం కావొచ్చు. ఇక పథకాలకు బటన్లు నొక్కాలంటే చాలా కష్టపడాల్సి ఉంటుంది. ఎక్కడెక్కడ ఆస్తులు తాకట్టు పెట్టాల్సి ఉంటుంది. లేకపోతే కేంద్రం అదనపు అప్పులకు పర్మిషన్లు ఇవ్వాల్సి ఉంటుంది. అలాంటివి లేకపోతే వచ్చే ఎన్నికల ముందు గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటారు. అందుకే ఇప్పుడే ఎన్నికలకు వెళ్లడం మంచిదన్న అభిప్రాయానికి వస్తున్నారు. ఏం నిర్ణయం తీసుకుంటో … కేబినెట్ భేటీలో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.