తెలంగాణ బీజేపీ పరిస్థితి ఇప్పుడు గందరగోళంగా ఉంది. ఎన్నికలు ముంచుకొస్తున్న సమయంలో ఎవరూ ఎలాంటి రాజకీయకార్యక్రమాలు చేపట్టలేని స్థితికి వెళ్లిపోయింది. జేపీ నడ్డా తెలంగాణలో సభ పెట్టినా ఎవరూ పట్టించుకోలేదు. దీనికి కారణం హైకమాండే. బెంగాల్ తరహాలో బీఆర్ఎస్ పై యుద్ధం ప్రకటించాలనుకున్నంతలో మొత్తం సైలెంట్ అయిపోయింది. దీంతో బీఆర్ఎస్, బీజేపీ మధ్య రహస్య అవగాహన ఉందని ఎక్కువ మంది నమ్మడం ప్రారంభించారు. బీజేపీకి వచ్చిన హైప్ అంతా చల్లారిపోయింది.
ఇప్పుడు పార్టీ అధ్యక్షుడి మార్పుపై ఊహాగానాలు వినిపిస్తున్నాయి. తెలంగాణ నేతలు పోరాటం ఆపేసి.. తమ స్థాయిలపై చర్చలు పెట్టుకుంటున్నారు. వీటన్నింటినీ చక్కదిద్దాలంటే ఇప్పుడు పార్టీలో సర్దుబాటు చేయాలి. అలా చేయాలంటే కేంద్ర మంత్రిగా కొనసాగిస్తూనే .. కిషన్ రెడ్డిని చీఫ్‌ను చేసి.. బండి సంజయ్ ను కేంద్ర మంత్రిని చేయాలని ఆలోచిస్తున్నట్లుగా లీకులు బయటకు వచ్చాయి. కిషన్ రెడ్డి అయితే పాతకాపు కాబట్టి ఎవరికీ అభ్యంతరాలు ఉండవని కేంద్ర పెద్దల అంచనాగా చెబుతున్నారు. కానీ అది పెద్ద తప్పు అవుతుందని.. కష్టమో నష్టమో బండి సంజయ్ నేతృత్వంలోనే ఎన్నికలు ఎదుర్కోవాలన్న అభిప్రాయాలూ బలంగా వినిపిస్తున్నాయి.
పార్టీకి ఊపు తెచ్చిన బండిసంజయ్ ను ఎన్నికలకు ముందు మారిస్తే అది మంచి నిర్ణయం ఎలా అవుతుందన్న సందేహం సహజంగానే ఉంటుంది. కిషన్ రెడ్డి.. బీఆర్ఎస్ పై .. సంజయ్ తరహాలో పోరాడరు. ఆయనకు కేసీఆర్ పై సాఫ్ట్ కార్నర్ ఉందన్న ప్రచారం ఉంది . ఇప్పుడు కిషన్ రెడ్డిని మళ్లీ చీఫ్ ను చేస్తే కొండ నాలికకు మందేస్తే ఉన్న నాలికను ఊడిపోయేలా చేయడమేనన్న వాదన వినిపిస్తోంది. మొత్తంగా తెలంగాణ బీజేపీ విషయంలో హైకమాండ్ నిర్ణయాలు రివర్స్ అయ్యాయి. ఇప్పుడు ఏం చేసినా కలసి రావడం కాదు కదా.. ఇంకా ఎక్కువ నష్టం జరిగే అవకాశాలు ఉన్నాయన్న ఆందోళన ఆ పార్టీ క్యాడర్ లో కనిపిస్తోంది.