కాంగ్రెస్ లో తన ప్రతినిధిని జగన్ రెడ్డిని విజయవంతంగా ప్రవేశపెడుతున్నారు. ఆయనే పొంగులేటి శ్రీనివాసరెడ్డి. రాఘవ కన్ స్ట్రక్షన్స్ పేరుతో కాంట్రాక్టులు నిర్వహించడమే కాదు.. కడప జిల్లాలోని జగన్ రెడ్డి బంధువులతో వియ్యమందుకున్న నేత. ఇప్పుడీయన కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. అదీ కూడా తన బలాన్ని ప్రదర్శిస్తూ భారీ సభ ఏర్పాటు చేసి మరీ కాంగ్రెస్ లో చేరుతున్నారు.
తెలంగాణలో బీఆర్ఎస్ నుంచి ఆయనకు పెద్దగా కాంట్రాక్టులు రాలేదు. కానీ ఏపీలో దారి కాచి పన్నులు వసూలు చేసే కాంట్రాక్టులు కూడా ఆయనకే దక్కాయి. గనులసీవరేజీని వసూలు చేసే బాధ్యతను ప్రైవేటు సంస్థలకు ఇచ్చింది ప్రభుత్వం. ఈ కాంట్రాక్టులు కూడా చాలా జిల్లాల్లో ఈ పొంగులేటి కుటుంబ కంపెనీలకే దక్కాయి. ఇక అన్నమయ్య డ్యాం సహా చాలా ప్రాజెక్టులు దక్కాయి. కొన్ని వేలకోట్ల బిల్లులు కూడా ఇటీవలే మంజూరు చేశారు. రూ. లక్ష బిల్లు కోసం పార్టీ నేతలు కాళ్లరిగేలా తిరుగుతున్నా పట్టించుకోలేదు. అలాంటి పొంగులేటి కాంగ్రెస్ లో చేరిక వెనుక జగన్ రెడ్డి లేకుండా ఉంటారని ఎవరైనా అనుకోగలరా ?
పొంగులేటి తన రాజకీయ అడుగులు ప్రతి విషయంలోనూ జగన్ సలహాలు తీసుకున్నారు. బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పిన తర్వాత బహిరంగంగానే మూడు సార్లు జగన్ తో భేటీ అయ్యారు. ఎన్ని రహస్య భేటీలు జరిగాయో తెలియదు కానీ.. చివరికి చాలా ఆలోచించినట్లుగా షో చేసి చివరికి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకుంటున్నారు. ఎలా చూసినా ఇప్పుడు జగన్ రెడ్డి తన మనిషిని కాంగ్రెస్ లోకి పంపగలిగారని.. వచ్చే ఎన్నికల తర్వాత ఎలాంటి పరిస్థితి ఏర్పడినా.. పొంగులేటి ద్వారా పనులు చక్కబెట్టుకుంటారన్న వాదన గట్టిగా వినిపించడంలో విచిత్రం ఏమీ ఉండదు.