రామ్ – బోయపాటి కాంబోలో రూపొందుతున్న సినిమాకి ‘స్కంద’ అనే టైటిల్ ఫిక్సయ్యింది. టైటిల్ గ్లిమ్స్ని చిత్రబృందం ఈరోజు విడుదల చేసింది. ”నేను దిగితే ఓడేది ఉండదు.. నేను దిగితే మిగిలేది ఉండదు” అంటూ రామ్ తో తనదైన శైలిలో బోయపాటి శ్రీను యుద్ధ కాండ సృష్టించారు. బోయపాటి సినిమా అంటే.. యాక్షన్‌కి లోటు ఉండదు. సినిమా సినిమాకీ ఈ డోసు పెరుగుతూనే ఉంది. ‘స్కంద’ అందుకు మినహాయింపు కాదని మరోసారి ఈ గ్లిమ్స్‌తో తేలిపోయింది. ‘ది ఎటాకర్’ అంటూ ఈ సినిమాకి ట్యాగ్ లైన్ పెట్టారు.
తమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. అఖండలో తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ప్లస్ అయ్యింది. ఈసారీ తమన్ తనదైన శైలిలో… బీజియమ్స్తో రెచ్చిపోయాడు. టైటిల్ ట్రాక్ యాక్షన్ మూడ్ ని ఎలివేట్ చేసేలా ఉంది. శ్రీలీల ఇందులో కథానాయిక. తన స్క్రీన్ ప్రెజెన్స్ ఎలా ఉంటుందో ఇప్పటి వరకూ తెలీలేదు. బోయపాటి తన సినిమాలో హీరోలనే కాదు, హీరోయిన్లనీ బాగా చూపిస్తాడు. శ్రీలీలని బోయపాటి ఎలా చూపించాడో తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాలి. మొత్తానికి ఈ టైటిల్ తో మరోసారి బోయపాటి తన ఆడియన్స్ ని మాస్ ట్రీట్ కి సిద్ధం చేసేశాడు. ఇక అసలు బొమ్మ ఎలా ఉంటుందో చూడాలి.