కాంగ్రెస్ పార్టీలో విలీనం కోసం చూస్తున్న షర్మిలకు ఆ పార్టీ హైకమాండ్ ఒక్కటే చాయిస్ ఇచ్చింది. తెలంగాణ రాజకీయాల్లో మీ అవసరం లేదని.. ఏపీలో రాజకీయాలు చేయాలనకుుంటే మాత్రం రెడ్ కార్పెట్ వేస్తామని లేకపోతే.. మీ రాజకీయం మీరు చేసుకోండని సందేశం పంపింది. దీనిపై షర్మిల ఎటూ తేల్చుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు.
తెలంగాణలో ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. షర్మిలకు ఏం చేయాలో పాలు పోవడం లేదు. ఎక్కడా ఒక్క లీడర్ లేరు. అంతకు మించి ఏమైనా చేయాలన్నా ఆర్థిక సమస్యలు వెంటాడుతున్నాయి. దీంతో ట్విట్టర్‌కే పరిమితమవుతున్నారు. కాంగ్రెస్ లో విలీనం చేసి కాంగ్రెస్ నాయకత్వాన్ని పొందాలనుకున్నారు. నాయకత్వం కాదు కదా కనీసం ఎమ్మెల్యే సీటు కూడా ఇచ్చేది లేదని తెలగాణ కాంగ్రెస్ నేతలు హైకమాండ్‌కు తేల్చేశారు. ఆమె ఏపీకి వెళ్లాలని అందరూ సలహా ఇస్తున్నారు.
వైఎస్ ఆత్మగా పేరు తెచ్చుకున్న కేవీపీ రామచంద్రరావు కూడా షర్మిలకు అదే సలహా ఇస్తున్నట్లుగా తెలుస్తోంది. ఏపీలోనే రాజకీయాలు చేయాలని ఆయన కూడా ఒత్తిడి తెస్తున్నట్లుగా చెబుతున్నారు. రాహుల్ గాంధీ ఖమ్మంటూర్ సందర్భంగా విజయవాడకు రాహుల్ గాంధీ వచ్చినప్పుడు మీడియాతో మాట్లాడుతూ పరోక్షంగా షర్మిల ఏపీలో కాంగ్రెస్ కు పూర్వవైభవం తెస్తారని చెప్పారు.
ఆమె ప్రభావం తెలంగాణలో ఏమీ లేదని… ఏపీలో అయితే కాంగ్రెస్ ను పునరుజ్జీవింప చేసుకోవడానికి ఉపయోగపడతారని కాంగ్రెస్ వ్యూహకర్తలు కూడా ఓ నిర్ణయానికి వచ్చారు. దీనిపై స్పష్టతను షర్మిలకు ఇచ్చారు. ఏపీలో రాజకీయానికి అంటే సరే కానీ.. తెలంగాణలో అయితే సాధ్యం కాదని సమాచారం ఇచ్చారు. ఇప్పుడు చాయిస్ షర్మిల చేతుల్లోనే ఉందని కాంగ్రెస్ వర్గాలంటున్నాయి. ఏపీలో రాజకీయాలు చేయాలనుకుంటే… వైఎస్ జయంతి రోజు విలీనం ప్రకటన చేయడానికి రెడీ అయ్యే అవకాశం ఉందంటున్నారు.