ఢిల్లీ ప్రభుత్వం సలహాదారులు, కన్సల్టెంట్స్ గా నియమించుకున్న 400 మందిని తొలగిస్తూ ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సెనా ఉత్తర్వులు జారీ చేశారు. మొత్తం 23 శాఖల్లో ఈ సలహాదారులు చక్రం తిప్పుతున్నారు. స్పెషలిస్టులు అన్న ట్యాగ్ లైన్ పెట్టేసి ప్రైవేటు వ్యక్తులను ప్రభుత్వ సలహాదారులుగా నియమించారని ఎల్జీ కార్యాలయం ఆరోపించింది. ఫెలోస్, అసోసియేట్ ఫెలోస్, అడ్వయిజర్స్, డిప్యూటీ అడ్వయిజర్స్, స్పెషల్టిస్టు, సీనియర్ రీసెర్చ్ ఫెలో, కన్సల్టెంట్ పదవులు సృష్టించి ఐనవారికి వాటిని కట్టబెట్టారని రద్దు చేశారు.
అయితే సలహాదారులు అనే మాట ముందుగా వినిపిస్తే ఎవరికైనా ఏపీ గుర్తుకు వస్తుంది. ఎందుకంటే టెన్త్ ఫెయిల్ అయిన వారిని కూడా సలహాదారులుగా నియమించేశారు మరి. అవసరం లేకున్నా సలహాదారులను పెట్టి ప్రతీ ఒక్కరికీ లక్షల్లో జీతం, అలవెన్సులు ,కార్యాలయాల పేరుతో కోట్లాది రూపాయలు ప్రజాధనాన్ని వృధా చేస్తోంది. కోర్టులో కేసులు పడిన తర్వాత జగన్ ప్రభుత్వం కాస్త వెనక్కి తగ్గింది. ఇకపై మంత్రులకు మాత్రమే సలహాదారులు ఉంటారని చెబుతూ హైకోర్టుకు విన్నవించుకుంది.
ఇప్పటికే కొనసాగుతున్న సలహాదారులను సంబంధింత మంత్రులకు సలహాదారులుగా రీడిజిగ్నేట్ చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి కొనసాగింపుగా.. సలహాదారులు నిర్వహించాల్సిన పాత్ర, బాధ్యతలను నిర్వచిస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది. విధానాల రూపకల్పనలో మంత్రులకు సలహాలివ్వడానికే సలహాదారులు పరిమితం అవుతారని పేర్కొంది. సివిల్ సర్వెంట్స్ రోజువారీ విధుల్లో వారి జోక్యం ఉండబోదని ప్రభుత్వం వాదిస్తోంది. కానీ ఢిల్లీలో పనికి రాని సలహాదారులు.. ఏపీ లో ఎలా పనికి వస్తారన్నది కీలకం. అయితే … మన దేశంలో పాలకులకు ఏదనుకుంటే అదిచేయవచ్చు. ఎవరికి ఎక్కువ బలం ఉంటే వారు చెప్పిందే రాజ్యాంగం.. చేసిందే చట్టం.