ఏంటీ నీకింకా పెళ్లి కాలేదా అని ముదురు బెండకాయను చూసి ఇతరులు అడిగితే… కాలేదు కాదు.. చేసుకోలేదు అని గంభీరంగా సమాధానం ఇచ్చే వారు సమాజంలో చాలా మంది ఉన్నారు. హర్యానాలో ఇంకా ఎక్కువ ఉంటారు. ఎందుకంటే అమ్మాయిలు అవసరం లేదనుకుని భ్రూణ హత్యలకు పాల్పడ్డ చెడ్డ పేరు ఆ రాష్ట్రానికి ఉంది. అందుకే అక్కడ మహిళల జనాభా తగ్గిపోయింది. ఫలితంగా అబ్బాయిలకు పెళ్లి కావడం గగనంగా మారింది.
పెళ్లి కాని పురుషులు అక్కడ పెరిగిపోయారు. వీరికి కుటుంబం లేకపోవడంతో…. ప్రభుత్వ సాయం కూడా అందడం లేదు. ఇప్పుడు వీరి బాధను హర్యానా ప్రభుత్వం గుర్తించింది. 45 ఏళ్లు దాటిన పెళ్లి కాని వాళ్లను గుర్తించి వారికి పెన్షన్ ఇవ్వాలని నిర్ణయించింది. దీనిపై హర్యానా ముఖ్యమంత్రి ఓ ప్రకటన చేశారు. ఇప్పటికే పథకంపై కసరత్తు పూర్తయిందని.. నెలలో ప్రకటన చేస్తామన్నారు.
అయితే ఈ పెళ్లి కాని ప్రసాదుల సమస్య హర్యనాలో మాత్రమే కాదని.. చాలా రాష్ట్రాల్లో ఉందని.. వారి సంగతిని కూడా ఆయా రాష్ట్రాలు చూసుకోవాలన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి. మామూలుగా కొత్త కొత్త స్కీములను వెదికే రాజకీయ పార్టీలకు .. ఇది ఓ గొప్ప స్కీమ్ అవుతుందని అనుకోకుండా ఉంటాయి. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో ఒంటి మహిళలకు పెన్షన్లు ఇస్తున్నారు. దాన్ని మగోళ్లకూ వర్తిస్తామని ప్రకటన చేయడానికి ఎన్నో రోజులు పట్టకపోవచ్చు.