ఆంధ్రప్రదేశ్లో బీజేపీ రాజకీయ వ్యూహంపై కొత్త చీఫ్గా పురందేశ్వరిని నియమించిన తర్వాత ఓ క్లారిటీ వచ్చినట్లయింది. టీడీపీతో పొత్తు పెట్టుకునే ఆలోచన లేదని రాజకీయవర్గాలు అంచనా వేస్తున్నాయి. ఎన్టీఆర్ కుమార్తె పురందేశ్వరి. చంద్రబాబుతో రాజకీయంగా తీవ్రంగా విబేధిస్తారు. తెలుగుదేశం పార్టీతో పొత్తు ఆలోచన ఉంటే… ఎన్టీఆర్ కుమార్తెను బీజేపీ అధ్యక్షురాలిగా నియమించరని.. చెబుతున్నారు. అదే సమయంలో పురందేశ్వరి .. ఏపీ ప్రభుత్వంపై తవ్రంగా విరుచుకుపడుతూ ఉంటారు. అంటే.. అటు వైసీపీకి.. ఇటు టీడీపీకి ఆమె దూరమే.
టీడీపీలో చోటు లేక.. రాజకీయంగా కాంగ్రెస్ లో చేరి.. ఆ తర్వాత బీజేపీలోకి వచ్చినా పురందేశ్వరి నింపాది రాజకీయాలు చేశారు. ఎక్కడా హడావుడి పడలేదు. బీజేపీలోకి వచ్చిన పదేళ్ల కాలంలో ఆమెను పెద్దగా గుర్తించిన సందర్భాలు లేవు. ఓ రాజ్యసభ సభ్యత్వం లేదా.. మరో కీలక పదవిని ఇచ్చే ప్రయత్నాలు ఎప్పుడూ చేయలేదు. భర్త దగ్గుబాటి వెంకటేశ్వరరావు వైసీపీ తరపున పోటీ చేశారు. ఎన్నికల తర్వాత వస్తే పురందేశ్వరి కూడా వైసీపీలోకి రావాలని లేకపోతే మీరు అవసరం లేదని చెప్పడంతో దగ్గుబాటి రాజకీయాలకు దూరం అయ్యారు కానీ.. వైసీపీలోకి వెళ్లాలని అనుకోలేదు.
వచ్చే ఎన్నికల్లో బీజేపీ ఒంటరి పోరు చేయాలనుకుంటుందోని.. అందుకే పురందేశ్వరిని అధ్యక్షురాలుగా నియమించారన్న అభిప్రాయం వినిపిస్తోంది. కారణం ఏదైనా గత ఎన్నికల మాదిరిగా.. ఈ సారి వైసీపీకి బీ టీం అనే ముద్ర మాత్రం ఉండకపోవచ్చు. బహుశా… బీజేపీ హైకమాండ్ కోరుకున్నది ఇదేనని అనుకుంటున్నారు.