రానా – తేజ కాంబోలో ‘నేనే రాజు – నేనే మంత్రి’ వచ్చింది. ఆ సినిమా కమర్షియల్ గా బాగా ఆడింది. ఇప్పుడు ఈ హిట్ కాంబినేషన్లో మరో సినిమా రూపుదిద్దుకొంటోంది. అదే… ‘రాక్షస రాజు’. వచ్చే నెలలో ఈ చిత్రాన్ని సెట్స్‌పైకి తీసుకెళ్తారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఓ ఆసక్తికరమైన విషయం వెలుగులోకి వచ్చింది. ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా రూపొందిస్తున్నార్ట. చాప్టర్ 1, చాప్టర్ 2… రూపంలో ఈ సినిమా విడుదల కాబోతోంది.
బాహుబలి, పుష్ప, కేజీఎఫ్.. ఇలా రెండు భాగాల ఫార్ములా బాగా వర్కవుట్ అయ్యింది. అందుకే ఈ సినిమానీ పార్ట్ 1, పార్ట్ 2లుగా విడగొట్టి విడుదల చేస్తున్నారు. అయితే షూటింగ్ మొత్తం ఏకధాటిగా సాగుతుందట. సినిమా మొత్తం పూర్తయ్యాక అప్పుడు దాన్ని రెండు భాగాలుగా విడుదల చేస్తారు. సాధారణంగా పార్ట్ 1కీ, పార్ట్ 2కీ చాలా గ్యాప్ వచ్చేస్తోంది. అలా కాకుండా..3 నెలల వ్యవధిలో రెండో భాగాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారు. ఈ చిత్రాన్ని సైతం పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేద్దామనుకొంటున్నారు. ఇతర నటీనటుల్లో కొంతమంది స్టార్లు కనిపించే అవకాశం ఉంది.