అమరావతిని నిర్వీర్యం చేసే ఉద్దేశంతో రాయలసీమలో పేదలకు కేటాయించిన యాభై వేల ఇళ్లను రద్దు చేసి అమరావతిలో నిర్మించాలని అనుకున్న సీఎం జగన్ రెడ్డికి కేంద్రం షాక్ ఇచ్చింది. రద్దు చేసి ఆ యాభై వేల ఇళ్లను అమరావతిలో నిర్మాణానికి అంగీకరించినా… డబ్బులు మాత్రం ఇవ్వలేమని తేల్చి చెప్పేసింది. దీంతో ఏపీ అధికారులకు మైండ్ బ్లాంక్ అయింది.
అమరావతి వివాదం కోర్టులో ఉందని.. ఆ స్థలాల్లో ఇళ్లు కట్టుకోవడానికి అనుమతి ఉందా లేదా అనేది తేలాల్సి ఉంది. అదే సమయంలో యాజమాన్య హక్కులు లేని చోట్ల ఇళ్ల నిర్మాణానికి నిధులు మంజూరు చేసే పద్దతి లేదు. అందుకే… ఇప్పుడు ఇళ్లు మంజూరు చేశామని.. రాష్ట్ర నిధులు పెట్టి కట్టుకుంటే కట్టుకోవాలని.. తాము మాత్రం నిధులు ఇచ్చేది లేదని స్పష్టం చేశారు. కోర్టు కేసులు అనుకూలంగా వస్తే అప్పుడు ఇస్తామని తేల్చి చెప్పడంతో ఏపీ అధికారులు నిరాశకు గురయ్యారు.
అయితే నిధులు ఇప్పుడు మంజూరు చేయాలని.. కోర్టు కేసు అనుకూలంగా రాకపోతే ఆ నిధులు వెనక్కి ఇస్తామని ప్రతిపాదన పెట్టారు. ఈ ప్రతిపాదనపై కేంద్ర అధికారులు .. ఏపీ అధికారుల్ని ఎగాదిగా చూసి పంపించారని అంటున్నారు. మరో వైపు హైకోర్టు కూడా… ఆర్ 5 జోన్ స్థలాల్లో ఇళ్ల నిర్మాణానికి సుప్రీంకోర్టు అనుమతి ఇస్తే చూపించాలని ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. పట్టాల పంపిణీకి మాత్రమే సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చిందని రైతులు పిటిషన్ వేశారు. పదకొండోతేదీన విచారణ జరగనుంది.
ఇళ్ల నిర్మాణానికి అనుమతి లేదు. అందుకే… శంకుస్థాపనలు కూడా చేసే అవకాశం లేదని భావిస్తున్నారు.