ఏపీలో అనధికార ప్రభుత్వం ఐ ప్యాకేనని మరోసారి నిరూపితమయింది. వైసీపీ పార్టీని చిటికెన వేలు మీద ఆడిస్తున్న ఐ ప్యాక్.. తాజాగా… ప్రభుత్వం ఎక్కడెక్కడ రోడ్లు వేయాలో కూడా ఓ జాబితా తయారు చేసి ఇచ్చింది. వాటికి ఏపీ ప్రభుత్వం పరిపాలనా అనుమతులు మంజూరు చేసింది. దీంతో వైసీపీ నేతలు అవాక్కయ్యారు. తమ నియోజకవర్గ అవసరాలు… ప్రజల డిమాండ్లను బట్టి తాము ఇచ్చే ప్రతిపాదనల్ని లెక్కలోకి తీసుకోవాలి కానీ ఐ ప్యాక్ చెబితేనే మంజూరు చేయడం ఏమిటని వారు ఆశ్చర్యపోయారు.
ఏపీలో నాలుగేళ్లుగా రోడ్లు వేయలేదు. కనీసం నిర్వహణ చేపట్టలేదు. దాంతో ప్రజాప్రతినిధులకు అవే డిమాండ్లు ఎక్కడకు వెళ్లినా వస్తున్నాయి. ఎన్నికలకు ముందు కూడా రోడ్లు వేయకపోతే సమస్యలు వస్తాయని… కనీసం మంజూరు చేసి..పనులు చేస్తూ ఊండగా ఎన్నికలకు వెళ్తే మంచిదని భావిస్తున్నారు. అందుకే పరిపాలనా అనుమతిలు మంజూరు చేశారు. దాదాపుగా రూ. పన్నెండు వందలకోట్ల పనులకు ఓకే చెప్పారు. నిజానికి రాష్ట్రంలో వేయాల్సిన రోడ్లకు ఈ నిధులు ఏమాత్రం సరిపోవు.
కానీ ఐ ప్యాక్.. ప్రజా వ్యతిరేకత ఎక్కడ ఎక్కువగా ఉందో చూసి.. అక్కడ మాత్రమే రోడ్లు వేస్తే చాలని సిఫారసు చేసింది. మిగిలిన చోట్ల రోడ్లు వేయకపోయినా ప్రజలు.. కులం.. పార్టీ ఆధారంగా ఓట్లేస్తారని.. తేల్చింది. అందుకే .. ఫైనాన్షియల్ క్రైసిస్ లో ఉన్న ప్రభుత్వం.. ఐ ప్యాక్ చెప్పిన వాటికి మాత్రమే… నిధులు మంజూరు చేసింది. ప్రభుత్వ యంత్రాంగం.. పార్టీ నేతలు అందరూ పానకంలో పుడకలేనని.. అంతా ఐ ప్యాకేనని మరోసారి స్పష్టత నిచ్చినట్లయింది.