సార్వత్రిక ఎన్నికలకు గట్టిగా మరో ఎనిమిది నెలల సమయం కూడా లేదు. ఈ లోపు ఐదు రాష్ట్రాల ఎన్నికలను ఎదుర్కోవాలి. ఆ తర్వాత పార్లమెంట్ ఎన్నికలకు వెళ్లాలి. పరిస్థితి చూస్తూంటే.. ఎదురీదుతున్నట్లుగా కనిపిస్తోంది. పదేళ్ల పాలనా వ్యతిరేకత ప్రజల్లో ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. దీంతో మోదీకి కంగారు ప్రారంభమయినట్లుగా కనిపిస్తోంది. అందుకే పార్టీని, ప్రభుత్వాన్ని ప్రక్షాళన చేయాలనుకుంటున్నట్లుగా కనిపిస్తోంది.
నాయకుల్ని మార్చేసి ప్రజల్ని మభ్య పెట్టగలరా ?
ఎన్నికలకు ముందు రాష్ట్రాల పార్టీల అధ్యక్షుల్ని.. కేంద్ర మంత్రుల్ని.. ముఖ్యమంత్రుల్ని కూడా పూర్తి స్థాయిలో మార్చేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లుగా కనిపిస్తోంది. వీరందర్నీ బలి ఇచ్చి మీ కష్టాలకు వీరే కారణం వారిని తొలగించాం కాబట్టి ఇక సుఖాలేనని ప్రజలకు చెబుతారు. కానీ ప్రజలు అంత ఈజీగా నమ్మేస్తారా అన్నది ఇప్పుడు కీలకం. ఎందుకంటే ప్రతీ దానికి ప్రధాని మోదీని ముందు పెట్టుకోవడం బీజేపీ ఇప్పటి వరకూ చేసిన పని. ఏం చేసినా మోదీ అనే చెప్పుకున్నప్పుడు… ఇతరుల్ని మార్చేసి.. ఓట్లు వేయండి అని అడగడం ఎలా వర్కవుట్ అవుతుంది.
మారుతున్నరాహుల్ ఇమేజ్ అదే బీజేపీకి ఇబ్బంది
రాహుల్ గాంధీ ఇమేజ్ మారుతోంది. మొదటి నుంచి ఆయన క్లాస్ లుక్ కు అనుగుణంగా ఇండియా రాజకీయాల్లో ఉండాలంటే కళంకం ఉండాలన్నట్లుగా ముద్ర వేశారు. ఆయనను పప్పుగా తేల్చి.. ట్రోల్ చేసేవారు. ఇందు కోసం ఓ వ్యవస్థను కూడా ఏర్పాటు చేసుకున్నారు భారత్ జోడో యాత్ర తర్వాత రాహుల్ ఇమేజ్ మారిపోయింది. ఆయనకు సబ్జెక్ట్ కూడా ఉందన్న అభిప్రాయం బలపడుతోంది. ప్రెస్ మీట్లను ఏ మాత్రం భయం లేకుండా ఎదుర్కొంటున్నారు. రాహుల్ ఇమేజ్ పెరుగుతోందని వివిధ సర్వే రిపోర్టులు వెల్లడిస్తున్నాయి. దీంతో మోదీలో కంగారు ప్రారంభమయిందని రాజకీయవర్గాలు అంచనా వేస్తున్నాయి.
పతనం అంటూ ప్రారంభమైతే ఎన్ని చర్యలు తీసుకున్నా కష్టమే !
ప్రధానమంత్రిగా మూడో సారి నరేంద్రమోదీ వస్తారని సర్వేలు చెబుతున్నాయి. కానీ ఎన్నికల నాటికి పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పడం కష్టం. కానీ ఎన్డీఏ ప్రభుత్వంపై ప్రజల్లో అనుకున్నంత గ్రాఫ్ లేదని మాత్రం అందరికీ ఓ అంచనా ఉంది. ఒక వేళ రాహుల్ ను ప్రత్యామ్నాయంగా ప్రజలు భావించడం ప్రారంభిస్తే బీజేపీ గ్రాఫ్ ఇంకా వేగంగా తగ్గిపోతుంది. అదే జరిగితే… ఎన్ని మార్పు చేర్పులు చేసినా బీజేపీని మళ్లీ అధికారంలోకి తీసుకు రావడం కష్టం అవుతుంది.