విజయ్ దేవరకొండ – పరశురామ్ కాంబినేషన్లో ఓ సినిమా రూపుదిద్దుకుంటున్న సంగతి తెలిసిందే. దీనికి ‘ఫ్యామిలీ స్టార్’ అనే టైటిల్ దాదాపుగా ఫిక్స్ చేసేశారు. ఇప్పుడు షూటింగ్ కి ముహూర్తం కూడా కుదిరింది. ఈనెల 12న హైదరాబాద్ లో షూటింగ్ మొదలెడతారని టాక్. ఈ సినిమాకి సంబంధించిన కొంతపార్ట్ అమెరికాలో తీయాలి. అందుకే పరశురామ్ ప్రస్తుతం అమెరికాలో లొకేషన్ల వేటలో ఉన్నాడు. అక్కడ లొకేషన్లు సెట్ చేసే పనిలో బిజీగా తిరుగుతున్నాడు. మరో రెండ్రోజుల్లో పరశురామ్ ఇండియా తిరిగొస్తాడు. హైదరాబాద్ లో కొన్నిసీన్లు తీశాక.. చిత్రబృందం అమెరికా విమానం ఎక్కేస్తుంది.
ఈ చిత్రంలో మృణాల్ ఠాకూర్ ని కథానాయికగా ఎంచుకొన్న సంగతి తెలిసిందే. ఇందులో మరో కథానాయికకీ చోటుంది. ఆమె కోసం ప్రస్తుతం చిత్రబృందం అన్వేషిస్తోంది. మరోవైపు విజయ్ ‘ఖుషి’ షూటింగ్ ముగింపు దశకు చేరుకొంది. ఈవారంలోనే ఈ సినిమా షూటింగ్ మొత్తం పూర్తవుతుంది. అందుకే ఫ్యామిలీ స్టార్‌కి కాల్షీట్లు కేటాయించేశాడు.