టాలీవుడ్ బడ్జెట్ లెక్కలు ఎప్పుడో మారిపోయాయి. ఇప్పుడు ఎంత ఖర్చు పెట్టామన్నది అసలు పాయింటే కాదు. ఎంత వచ్చిందన్నదే లెక్క. కథ డిమాండ్ చేయాలే కానీ, ఎంతైనా పెట్టుబడి పెట్టొచ్చు. సినిమాలో సత్తా ఉండాలే కానీ, ఎంతైనా రాబట్టొచ్చు అనే నిజాల్ని ఇటీవల చాలా సినిమాలు నిరూపించాయి. ఇది వరకు ఓసినిమాకి రూ.100 కోట్లు పెట్టుబడి పెడితే అమ్మో అనుకొనేవారు. ఇప్పుడు అది వందల కోట్లయ్యింది. ఆదిపురుష్‌కి రూ.500 నుంచి రూ.600 కోట్లు ఖర్చు పెట్టారని టాక్. ఆర్.ఆర్.ఆర్కీ రూ.400 కోట్లకు పైనే అయ్యింది. ఇప్పుడు భారతదేశ చలన చిత్ర చరిత్రలోనే అత్యధిక వ్యయంతో రెండు చిత్రాలు తయారవుతున్నాయి. ఒకటి.. ప్రభాస్ సినిమా, మరోటి మహేష్సినిమా.
ప్రాజెక్ట్ కె బడ్జెట్ ఎంతో లెక్క తేలలేదు కానీ ఇప్పటి వరకూ అయితే మనదేశపు ఖరీదైన చలన చిత్రమిదే. దాదాపుగా ఈ సినిమా కోసం రూ.700 నుంచి రూ.800 కోట్లు ఖర్చు పెడుతున్నారని టాక్. ప్రభాస్, అమితాబ్, కమల్ లాంటి ఉద్దండులు కలిసి నటిస్తున్న సినిమా ఇది. కాబట్టి అంత ఖర్చు పెట్టడంలో తప్పు లేదు. ఈ సినిమా హాలీవుడ్ ని టార్గెట్ చేస్తోంది. చిత్రబృందం అనుకొన్నది అనుకొన్నట్టు జరిగితే… కనీసం రూ.1000 కోట్లు రాబడుతుంది. 2024 సంక్రాంతికి ఈ చిత్రాన్ని విడుదల చేస్తారు. పార్ట్ 1, పార్ట్ 2లుగానూ ఈ సినిమా వచ్చే అవకాశం ఉంది.
మరోవైపు ప్రాజెక్ట్ కెని తలదన్నేలా… మహేష్ – రాజమౌళి సినిమా రూపుదిద్దుకోనుంది. ప్రాజెక్ట్ కె బడ్జెట్ రూ.800 కోట్లయితే, ఆ రికార్డ్ ని మహేష్ సినిమా అవలీలగా క్రాస్ చేయబోతోంది. ఈ చిత్రానికి ఏకంగా రూ.1500 కోట్లు పెట్టుబడి పెడుతున్నారని టాక్. ప్రాజెక్ట్ కెని ఎలాగైతే స్టార్లతో నింపేసినట్టే.. మహేష్ సినిమాలోనూ స్టార్లు సందడి చేయబోతున్నార్ట. రాజమౌళి అడగాలే గానీ, పని చేయడానికి ఎంతటి స్టార్ అయినా రెడీ. కాబట్టి.. ఈ సినిమాలోనూ స్టార్లకు లోటు ఉండదు. రాజమౌళిది ఇప్పుడు అంతర్జాతీయ బ్రాండ్. తనకు మహేష్ తోడయ్యాడు. ఈసారి రాజమౌళి కూడా హాలీవుడ్ ని ధ్యేయంగా చేసుకొని ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాడు. ఇంగ్లీష్వెర్షన్ కూడా రెడీ చేయబోతున్నాడు. భారీ ప్రాజెక్ట్ కాబట్టి మరి కొంత మంది నిర్మాతలు కూడా ఈ టీమ్ లో భాగం పంచుకోబోతున్నారు. ఇప్పటి వరకూ అయితే ప్రాజెక్ట్ కె అత్యంత కాస్ల్టీ సినిమా. దాన్ని వెను వెంటనే బ్రేక్ చేసే సినిమా రాజమౌళిదే. రెండూ తెలుగు సినిమాలు కావడం తెలుగు ప్రేక్షకులంతా గర్వించదగిన విషయం.