7:11 PM Movie Review
తెలుగు360 రేటింగ్ : 2.25/5
చిన్న సినిమా ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించాలంటే ఏదో ఓ కొత్తదనం వుండాల్సిందే. అందులోనూ థియేటర్ లో రాణించాలంటే మేకింగ్ పరంగా కూడా సవాళ్ళు వుంటాయి. ఇప్పుడు 7: 11PM అనే చిన్న సినిమా టైం ట్రావెల్ కాన్సెప్ట్ తో వచ్చింది. అందరూ కొత్తవాళ్ళతో తీసిన సినిమా ఇది. ట్రైలర్ చూస్తే కాస్త డీసెంట్ గానే ఉంది. టైం ట్రావెల్ విజువల్స్ లావిష్ గా కనిపించాయి. మైత్రీ మూవీ మేకర్స్ సినిమాని విడుదల చేయడం ఇంకాస్త దృష్టిని ఆకర్షించగలిగింది. ఒక ఊరు, రెండు గ్రహాలు, మూడు కాలాలు.. ఇలాంటి ఆసక్తికరమైన సెటప్ తో ఈ కథని ప్రేక్షకులకు చూపించే ప్రయత్నం చేశాడు కొత్త దర్శకుడు చైతు మాదల. మరి ఆ ప్రయత్నం ఏ మేరకు ఆకట్టుకుందో చూద్దాం.
అది 1990. హంసలదీవి అనే ఊరు. రవి (సాహస్) స్నేహితులతో కలసి మెకానిక్ షెడ్ నడుపుతుంటాడు. అదే వూరికి చెందిన విమల (దీపిక)తో ప్రేమలో ఉంటాడు. ఆ వూర్లో ‘అపరిమిత మ్యూచువల్ ఫండ్స్’ అనే సంస్థ నాలుగు రూపాయిల వడ్డీ ఇస్తానని చెప్పి ప్రజల డబ్బునంతా తన దగ్గర పెట్టుకొని బోర్డ్ తిప్పేయడానికి రెడీగా వుంటుంది. మరోవైపు స్థానిక మంత్రి అక్కడ డ్యామ్ కట్టడానికి ప్రయత్నిస్తుంటాడు. ఐతే డ్యామ్ పేరుతో న్యూక్లియర్ వ్యర్ధాల డంప్ నిర్మించాలనేది అతని కుట్ర. మరోవైపు భవిష్యత్ కాలం 4000 నుంచి ఓ ఇద్దరు గ్రహాంతర వాసులు హంసలదీవికి వచ్చి ఓ పుస్తకం కోసం వెదుకుతుంటారు. ఈ మూడు ఉపకథలుగా నడుస్తున్న క్రమంలో ఓ రోజు అనుకోకుండా మరో అపరిచితుడితో కలసి ఓ బస్ ఎక్కుతాడు రవి. అది మామూలు బస్ కాదు.. స్పేస్ క్రాఫ్ట్. అది రవిని 2024 ఆస్ట్రేలియాలో దించేస్తుంది. తర్వాత ఏం జరిగింది ? హంసల దీవి వూరు, విమల, అపరిమిత మ్యూచువల్ ఫండ్స్ , డ్యామ్ పేరుతో చేపట్టిన న్యూక్లియర్ డంప్.. ఇవన్నీ 2024 నాటికి ఏ స్థితిలో వున్నాయి? రవి మళ్ళీ వెనక్కి వెళ్ళాడా ? అక్కడ పరిస్థితిని చక్కదిద్దాడా ? కాలంతో పోటి పడిన రవికి ఎలాంటి సవాళ్ళు ఎదురయ్యాయి ? అనేది తక్కిన కథ.
కొన్ని కథలు పేపర్ మీద బావుంటాయి కానీ వానిటి తెరపైకి తెచ్చినప్పుడు మాత్రం మ్యాజిక్ మిస్ అవుతుంది. ఎమోషన్ తేలిపోతుంది. 7: 11PM లో కూడా ఇదే జరిగింది. 7: 11PM కాన్సెప్ట్ పరంగా కాస్త కొత్త ప్రయత్నమే. కానీ దానిని తెరపై తీసుకురావడం, ఆ ఎమోషన్ ని కనెక్ట్ చేయడంలో నిరాశపరుస్తుంది. టైం ట్రావెల్ కథలు ఇది వరకూ చూశాం. 7: 11PM కథని ఒక విలేజ్ డ్రామా సెటప్ లో మొదలుపెట్టాడు దర్శకుడు. కథ వేరే గ్రహంలో ప్రారంభమై హంసల దీవి అనే ఊరులో ల్యాండ్ అవుతుంది. ఇంటర్వెల్ వరకూ ఆ ఊరి కథే నడుస్తుంది. ఐతే ఇందులో అసలు కథ కంటే ఉపకథలు ఎక్కువైపోయాయి. ఒక వెబ్ సిరిస్ డీల్ చేసినట్లు ప్రతి పాత్ర చుట్టూ అనవసరమైన డ్రామాని నడిపారు. హీరో హీరోయిన్ లవ్ స్టొరీ, హీరోకి ఊరు మీద వున్న ప్రేమ, అపరిమిత మ్యూచువల్ ఫండ్స్ ట్రాక్, న్యూక్లియర్ డ్యామ్, హీరో తండ్రి చావుకి కారకులు, వేరే గ్రహం నుంచి వచ్చిన గ్రహాంతర వాసులు.. ఇలా ఎన్నో ట్రాకులు ఫస్ట్ హాఫ్ లోనే చెప్పేయాలనుకొనే ప్రయత్నం.. కంగాళీగా మారిపోయింది.
హీరో ఫ్రెండ్స్ గ్యాంగ్ తో కలసి మ్యూచువల్ ఫండ్స్ ని డబ్బుని కాజేస్తుంటాడు. ఆ ట్రాక్ ఏమిటో చాలా సేపటి వరకూ క్లారిటీ వుండదు. దర్శకుడికి ఈ విషయంలో క్లారిటీ ఉండొచ్చు. కానీ చూస్తున్న ప్రేక్షకుడికి కూడా ఆ తంతు అర్ధమైనప్పుడే ఆ డ్రామాకి కనెక్ట్ అవ్వగలడు. ఇదే కాదు ఇందులో చాలా ఎలిమెంట్స్ అలా క్లారిటీ లేకుండా వుంటాయి. పైగా చాలా ఎమోషన్స్ ని చెప్పేయాలనుకునే ప్రయత్నం కూడా దెబ్బకొట్టింది. కొత్తవాళ్ళతో సినిమా చేసిన్నప్పుడు వాళ్ళ ఇమేజ్ ఏమిటి ? అనే స్ప్రూహతో కథలు రాసుకోవాలి. ఓ పెద్ద స్టార్ ని దృష్టిలో పెట్టుకొని కథ రాయడం తప్పుకాదు. కానీ అదే కథని ఓ కొత్త కుర్రాడితో తీసేయడం ముమ్మాటికీ తప్పే. కొత్త ముఖం వున్నప్పుడు ఆ పాత్రని రిజిస్టర్ చేసుకోవడానికే కాస్త టైం పడుతుంది. అలాంటింది ఏకంగా ఆ పాత్రతో కాలాలు, గ్రహాలు జంప్ చేయించేయడం అంత తెలివైన పని కాదు.
పై ఈ కథ చెప్పడానికి దర్శకుడు ఆశ్రయించిన కొన్ని ఎలిమెంట్స్ కూడా అనవసరం అనిపిస్తుంది. హీరో ఒక అనాధ టైపు క్యారెక్టర్. ఆ ఊరు అతడిని ఆదరిస్తుంది. అలాంటి ఊరుకే ఆపద వస్తే అతడు ఎంతకైనా తెగిస్తాడనేది చెప్పడం దర్శకుడి ఉద్దేశంగా కనిపించింది. ఇలాంటి ఉద్దేశం వున్నప్పుడు ఆ ఊరుని జీవం వుట్టిపడేట్లు చూపించాలి. ఆ మనుషులు, వాళ్ళ ప్రేమలు, అభిమానులు ప్రేక్షకులకు కనెక్ట్ కావాలి. అలా కాకుండా ఊరు పై ఒక ఏరియల్ షాట్ వేసి.. కూతురు పెళ్లి కోసం మ్యూచువల్ ఫండ్స్ లో డబ్బుని దాచుకున్న ఓ పెద్దమనిషిని చూపించి.. అదే వూరు.. అదే ప్రేమ అనుకోవాలంటే కష్టం.
ఇంటర్వెల్ బాంగ్ తో అసలు కథ మొదలుపెట్టాడు దర్శకుడు. ఐతే తర్వాత నడిపిన కథనం కాస్త లేజీగా వుంటుంది. హీరో తాను 2024లో వున్నానని తెలుసుకోవడానికి దాదాపు చాలా స్క్రీన్ టైం పట్టేస్తుంది. ఇలాంటి కథకు అంత లాగ్ అనవసరం. ట్రైలర్ కట్ లోనే ఈ కథ చెప్పినపుడు సినిమాలో దానిని మరింత స్పీడ్ గా రన్ చేయాల్సింది. అలాగే ఈ కథని తన సౌకర్యానికి అనుగుణంగా రాసుకున్నాడు దర్శకుడు. ఆస్ట్రేలియాలో హీరో, సారాకి పరిచయం అవ్వడం, సారా తండ్రి ఒక స్పేస్ సైంటిస్ట్ కావడం, రవి మళ్ళీ వెనక్కి వెళ్ళడానికి మార్గం దొరకడం.. ఇవన్నీ కథలో సహజంగా కాకుండా కల్పించుకొని రాసినట్లు వుంటుంది. పైగా ఓ అపరిచితుడు రూపంలో ఈ కథ కాసేపు సైకో కిల్లర్ డ్రామాగా కూడా కనిపిస్తుంది. ఐతే రవి మళ్ళీ వెనక్కి వెళ్లి జరిగిపోయిన దానిని మార్చడానికి చేసిన ప్రయత్నం మాత్రం ఓకే అనిపిస్తుంది. క్లైమాక్స్ లో వున్న వేగం, వినోదం సినిమా మొత్తంలో పాటించివుంటే 7: 11PM కాస్త బెటర్ గా వుండేది.
రవి పాత్ర చేసిన సాహస్ తన పాత్ర మేరకు రాణించాడు. తన నటన సహజంగానే వుంది. అలాగే విమల పాత్రలో చేసిన దీపిక పల్లెటూరి అమ్మాయిల డీసెంట్ గా కనిపించింది. సారా పాత్రలో చేసిన నటి కూడా ఆకట్టుకుంది. భరత్ రెడ్డిది కూడా కీలకమైన పాత్రే. చివర్లో ఆ పాత్రలో ఇంకో ఉపకథ చెప్పేయాలని ప్రయత్నం చేశాడు దర్శకుడు. రైజింగ్ రాజు పాత్రని పెక్యులర్ గా డిజైన్ చేశారు. చివర్లో కాసేపు నవ్విస్తాడు. మంత్రి పాత్ర చేసిన నటుడడితో మిగతా పాత్రలు పరిధి మేర చేశాయి.
చిన్న సినిమా ఇది. అయినప్పటికీ లార్జర్ దెన్ లైఫ్ కంటెంట్ తో మెప్పించాలని చేసిన దర్శకుడి ప్రయత్నం మెచ్చుకోవాల్సిందే. ఈ మధ్య చిన్న సినిమాలు అంటే పెళ్లి, ప్రేమ, యంగేజ్ మెంట్ చుట్టూ మాత్రమే ఆలోచిస్తున్నారు దర్శకులు. కానీ కొత్త దర్శకుడు చైతు మాదల మాత్రం ఒక టైం ట్రావెల్ కథని చెప్పాలని చూశాడు. అయితే దీని కోసం ఇంకాస్త బలంగా వర్క్ చేయాల్సింది. కొన్ని చోట్ల మెప్పిస్తాడు కానీ ఇంకొన్ని చోట్ల మాత్రం లాజిక్ లెస్ గా అనిపిస్తుంది. జపాన్ వాడు వచ్చి హంసలదీవిలో న్యుక్లియర్ డంప్ యార్డ్ పెట్టుకోగలడా? దేశ రక్షణకి సంబందించిన న్యుక్లియర్ లాంటి ప్రాజెక్ట్స్ కి ఓ వూరు పెద్ద సంతకంతో గ్రీన్ సిగ్నల్ పడిపోతుందా ? కథలో కీలకమైన ఇలాంటి అంశాలు ఇంకాస్త లోతుగా స్టడీ చేయాల్సింది.
అలాగే ఒక పుస్తకానికి డీఎన్ఏ లాక్, గ్రహాంతర వాసులు భవిష్యత్ లో ఎదురుకునే బ్రెయిన్ డెడ్ ఇష్యూ .. ఇలాంటి అంశాలని కేవలం డైలాగులతో తేల్చేశాడు. ఇందులో అసలు కథ అంతా వాయిస్ ఓవర్ లోనే వుంటుంది. ఆ మాటల్ని సరిగ్గా వింటేనే ఆ టైం ట్రావెల్ అర్ధమౌతుంది. కాస్త పరధ్యానంగా వున్నా సరే.. మిగతా ప్రయాణం అర్ధం కాకపోయే ప్రమాదం వుంది. సినిమాని విజువల్ మీడియా అనేది అందుకే. ఇక్కడ ఏది చెప్పిన చూపించాలి. కానీ చాలా వరకూ వాయిస్ ఓవర్ మీదే డిపెండ్ అయిపోయాడు దర్శకుడు .
పాటలు, నేపధ్య సంగీతం అంత ఎఫెక్టివ్ గా వుండవు. చిన్న సినిమా అయినప్పటికీ తమ శక్తి మేర సీజీ వర్క్ చేసినట్లు కనిపిస్తుంది. ఈ రోజుల్లో థియేటర్లో సినిమా చూడాలంటే ఎదో కొత్తదనం, కొత్త ప్రపంచం వుండాలి. అలాంటి కొత్త ప్రయత్నమే జరిగింది. అయితే ప్రయత్నం మాత్రం ప్రేక్షకులని అంతగా ఆకట్టుకునేలా ఉండదనే చెప్పాలి.
తెలుగు360 రేటింగ్ : 2.25/5