తెలంగాణ కాంగ్రెస్ నేత పొంగులేటి శ్రీనివాసరెడ్డి తాడేపల్లిలో ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిని కలిశారు. మొదట వైసీపీ నుంచి ఎంపీగా గెలిచిన పొంగులేటి తర్వాత జగన్ సూచనతో బీఆర్ఎస్లో చేరారు. అక్కడ టిక్కెట్ ఇవ్వకపోవడంతో .. జగన్ సూచనలు, సలహాలతోనే కాంగ్రెస్ పార్టీలో చేరినట్లుగా గుసగుసలు వినపిస్తున్నాయి. దానికి తగ్గట్లుగానే కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత ఆయన జగన్ రెడ్డి క్యాంప్ ఆఫీసుకు వెళ్లి చర్చలు జరిపారు.
భవిష్యత్ అవసరాల కోసం వ్యూహాత్మకంగా జగన్ రెడ్డే.. కాంగ్రెస్ లోకి పొంగులేటిని పంపించారన్న ప్రచారం జరుగుతోంది. పొంగులేటికి బీఆర్ఎస్ లో ఉన్నప్పుడు తెలంగాణలో కాంట్రాక్టులు వచ్చేవి.కానీ ఇప్పుడు ఏపీలో పెద్ద ఎత్తున కాంట్రాక్టులు లభిస్తున్నాయి. పొంగులేటి శ్రీనివాసరెడ్డికి చెందిన రాఘవ కన్ స్ట్రక్షన్ కంపెనీతో పాటు ఆయన కుటుంబానికి చెందిన పలు కంపెనీలు ఏపీలో కాంట్రాక్టులు పొందాయి. కడపలో వరదల ధాటికి కొట్టుకుపోయిన అన్నమయ్య ప్రాజెక్టు పునర్ నిర్మాణ కాంట్రాక్ట్ కూడా పొంగులేటి కంపెనకే దక్కింది. మైనింగ్ శాఖ… సీవరేజీ వసూలును ప్రైవేటు సంస్థలకు ఇవ్వాలని నిర్ణయించింది. రెండు, మూాడు జిల్లాల్లో సీవరేజీ వసూలు చేసే కాంట్రాక్టులు కూడా పొంగులేటి కుటుంబానికి చెందిన కంపెనీలకే దక్కాయి.
అలాగే ఏపీలో త్వరలోనే వ్యవసాయ మోటార్లు, నివాస గృహాలకు స్మార్ట్ మీటర్లను బిగించనున్నారు. ఇందుకు కోసం దక్షిణ, మధ్య డిస్కమ్‌లలో టెండర్లను ఖరారుచేశారు. ఇందులో ఉమ్మడి నెల్లూరు, చిత్తూరు జిల్లాలకు సంబంధించిన రూ.2056.95 కోట్ల విలువైన పనులను రాఘవ కన్స్ట్రక్షన్స్కు దక్కింది. అసలు కన్ స్ట్రక్షన్స్ కు విద్యుత్ మీటర్లకు సంబంధంలేదు. కానీ అలా దక్కుతాయంతే. విద్యుత్ మీటర్ల కాంట్రాక్టులు.. అదానీకి.. జగన్ రెడ్డి దగ్గరి బంధువులకే దక్కాయి. వారిలో పొంగులేటి ఒకరు. అంటే ఎంత సన్నిహితులో అర్థం చేసుకోవచ్చు.