సీఎం జగన్ రెడ్డి ఇలా ఢిల్లీ వెళ్లి అలా మోదీ, షాలతో గుసగుసలాడి రాగానే.. జాతీయ మీడీయాలో ఐదు రాష్ట్రాలతో పాటు ఆరో రాష్ట్రంగా ఏపీలోనూ ఎన్నికలు జరుగుతాయని ప్రకటించేసింది. జగన్ అదే మాట్లాడారని చెప్పేశాయి. అయితే వైసీపీ నేతలు మాత్రం ఇదంతా టీడీపీ నేతలు ఆడుతున్న మైండ్ గేమ్ అని ప్రజా తీర్పు ప్రకారం చివరి రోజు వరకూ పాలన చేస్తామని చెబుతున్నారు. ఎంత మంది చెప్పినా నమ్మడం లేదని.. సజ్జల రామకృష్ణారెడ్డి కూడా మీడియా ముందుకు వచ్చి చెప్పారు.
ముందస్తు రావాలనేది చంద్రబాబు ప్లాన్ అని సజ్జల చెప్పుకొచ్చారు. ముందస్తు రావాలా వద్దా అన్నది చంద్రబాబు చేతుల్లో లేదు. ఉంటే ఖచ్చితంగా ముందస్తు ఉండేదమో ఎందుకంటే.. ఆయన ఎన్నికలు ఎప్పుడు పెట్టినా గెలిచేస్తామన్న ధీమాగా ఉన్నారు. కానీ వైసీపీ మాత్రం ఎన్నికలకు వెళ్లే ప్రశ్నే లేదంటోంది. చంద్రబాబు , పవన్ కల్యాణ్ ముందస్తు రావాలని కోరుకుంటున్నారని.. తమకు అలాంటి ఆలోచనలే లేవని చెప్పుకొస్తున్నారు . అసెంబ్లీని రద్దు చేస్తే బీజేపీ సహకారం విషయంలో అనుమానాలు ఉండటంతోనే..వైసీపీ వైపు నుంచి ఇలాంటి ప్రకటనలు వస్తున్నాయన్న అభిప్రాయం వినిపిస్తోంది.
పార్లమెంట్ తో పాటు ఎన్నికలు జరిగితే.. తమ ఎన్నికల అజెండా మొత్తం మారిపోతుందని వైసీపీ నేతలు భయపడుతున్నారు. జాతీయ అంశాలు హాట్ టాపిక్ అవుతున్నాయి. బీజేపీతో కలుపుగోలుగా ఉండి సాధించిందేమిటన్న ప్రశ్నలు ప్రజల ముందుకు వస్తాయి. ఐదేళ్లలో రాజధాని నిర్వీర్యం అయిపోయింది..పోలవరం పడకేసింది. రాష్ట్రం సర్వనాశనం అయిపోయింది. ఇవన్నీ లేకుండా సంక్షేమమే టాపిక్ గా ఎన్నికలకు వెళ్లాలంటే ప్రత్యేకంగా అసెంబ్లీ ఎన్నికలు జరగాలని వైసీపీ కోరుకుంటోందన్న చర్చ జరుగుతోంది.