ప్రధాని నరేంద్రమోదీ ఈ శనివారం తెలంగాణలో పర్యటించనున్నారు. షెడ్యూల్ లో రైల్వేశాఖ ఆధ్వర్యంలో కాజీపేటలో ఏర్పాటు చేయనున్న వేగన్ ఓవర్ హాలింగ్ సెంటర్ కు శంకుస్థాపన ఉంది. అనంతరం వరంగల్ మెగా టెక్స్ టైల్ పార్క్ కు శంకుస్థాపన చేస్తారు. 200 ఎకరాల్లో టెక్స్ టైల్ పార్కును కేంద్ర ప్రభుత్వం నిర్మించబోతోంది. ఇవి రెండు అధికారిక కార్యక్రమాలు వీటిలో ప్రోటోకాల్ ప్రకారం ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా పాల్గొనాలి. ఇందు కోసం అధికారికంగా ఆయనకు ఆహ్వానం అందింది. అయితే కేసీఆర్ హాజరవుతారా లేదా అన్నదానిపై స్పష్టత లేదు.
ప్రధాని మోదీ అధికారిక కార్యక్రమాల కోసం ఏ రాష్ట్రానికి వెళ్లిన అక్కడి సీఎంలు పాల్గొంటారు. బీజేపీ విధానాలపై ఎంత తీవ్రంగా వ్యతిరేకించినా.. మోదీ పై విమర్శలు చేసినా సరే .. బెంగాల్ సీఎం మమతా బెనర్జీ , తమిళనాడు సీఎం స్టాలిన్, కేరళ సీఎం విజయన్ వంటి వారు ప్రధాని వస్తే ప్రోటోకాల్ ప్రకారం ఆహ్వానం పలుకుతారు. కానీ సీఎం కేసీఆర్ మాత్రం ఇష్టపడలేదు. ప్రస్తుతం తెలంగాణలో రాజకీయ పరిస్థితులు మారిపోయాయి. బీజేపీపై కేసీఆర్ యుద్ధం దాదాపుగా ఆపేశారు. విమర్శలు కూడా చేయడం లేదు.
ఇటీవల కేటీఆర్ ఢిల్లీ వెళ్లి పలువురు కేంద్ర మంత్రుల్ని కూడా కలిసి వచ్చారు. ఇలాంటి సమయంలో ప్రధాని మోదీ తెలంగాణ పర్యటనకు వస్తే ఆయనకు కేసీఆర్ స్వాగతం చెప్పే అవకాశం ఉందన్నది ఎక్కువ మంది అంచనా వేస్తున్న విషయం. అయితే ఇలా ఆహ్వానం చెబితే రెండు పార్టీల మధ్య అవగాహన నిజమేనని ఎక్కువ ప్రచారం జరుగుతుంది. ఎందుకంటే గతంలో కేసీఆర్ఆహ్వానించలేదు.. ఇప్పుడెందుకు ఆహ్వానించారని ప్రశ్నించేవారు ఉంటారు. కేసీఆర్ తీసుకునే నిర్ణయం రాజకీయం గా కూడా కీలకమే.