తెలుగు రాష్ట్రాల్లో ప్రజలు రెడ్లనే ఎంపీలు, ఎమ్మెల్యేలుగా చేయాలని అనుకుంటున్నారని కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి తేల్చేశారు. వాళ్లే పరిపాలకులుగా ఉండాలనుకుంటున్నారని ఆయన చెప్పుకొచ్చారు. ఇదంతా ఎందుకంటే.. కాకినాడకు చెందిన ఓ వైసీపీ నేత అండర్ వరల్డ్ తో చేతులు కలిపి భారీ మాఫియా సామ్రాజ్యం నిర్వహిస్తున్నారని ఈనాడు పత్రిక కథనం రాసింది. వెంటనే భుజాలు తడిమేసుకుని నన్నే అంటారా అని ఆయన మీడియా ముందుకు వచ్చేశారు. తాను రెడ్డిని కాబట్టి రామోజీరావు ఇలా రాశారని కులం టచ్ ఇచ్చారు.
రామోజీరావు తన కులం వారిని అధికారంలోకి తీసుకురావడానికి ఇలాంటి రాతలు రాస్తున్నారని ఆరోపించారు. అయితే కాకినాడ మాఫియా రాజ్యం గురించి ఇప్పటికే కథలు కథలు గా చెప్పుకుంటున్నారు. ఇటీవల పవన్ కల్యాణ్ కూడా తన పర్యటనలో ద్వారంపూడి అరాచకాలను బయట పెట్టారు. ఆయన బియ్యం స్మగ్లింగ్ గురించి అందరికీ తెలుసు. ఇక కబ్జాలు.. దందాలు గురించి చెప్పాల్సిన పని లేదు. అయినా ఈనాడు తన పేరు పెట్టకపోయినా తనపైనే రాశారంటూ ఆయన తెరపైకి రావడం.. కులాలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం కలకలంగా మారతోంది.
ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి వైసీపీలో అత్యంత వివాదాస్పదమైన నేత. జగన్ వ్యాపార భాగస్వామిగా సాక్షి పత్రికకు జిల్లా ఎడిషన్ల భవనాలను ప్రి ఫ్యాకేటెడ్ పద్దతిలో నిర్మించిన కాంట్రాక్టర్ గా ఆయన జగన్ కు సన్నిహితమయ్యారు. ఆ తర్వాత విశ్వరూపం చూపించారు. వేల కోట్లు సంపాదించారని కాకినాడలో కథలు కథలుగా చెప్పుకుంటారు. ఆయన దౌర్జన్యాల గురించి లెక్కే లేదు. వచ్చే ఎన్నికల్లో ఓడించి తీరుతానని పవన్ కల్యాణ్ కూడా సవాల్ చేశారు.