జనసేన అధినేత పవన్ కల్యాణ్ వారాహి యాత్ర రెండో విడతను ప్రారంభించబోతున్నారు. తొమ్మిదో తేదీన ఏలూరులో బహిరంగసభ ఏర్పాటు చేశారు. ఇప్పటికి గోదావరి జిల్లాల్లోని 9 నియోజకవర్గాల్లో వారాహియాత్ర పూర్తయింది. మొత్తం 34 నియోజవకర్గాలు ఉన్నాయి. ఒక్కో నియోజకవర్గానికి రెండు రోజులు కేటాయించాలని పవన్ ఇప్పటికే నిర్ణయించుకున్నారు. అందుకే ముందుగా ఆ జిల్లాల్లో వారాహి యాత్రను పూర్తి చేయాలని అనుకుంటున్నారు.
వారాహి యాత్రకు మధ్యలో ఇచ్చే విరామాలతో కలిసి మరో రెండు నెలల పాటు గోదావరి జిల్లాలోనే కొనసాగించే అవకాశం ఉంది. జనసేనకు అత్యధిక బలం ఉన్న జిల్లాలుగా ఆ రెండింటిని భావిస్తున్నారు. తన బలంపై దృష్టి పెట్టి వారి నమ్మకాన్ని పెంచుకోవాలన్న లక్ష్యంతో పవన్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారని అంటున్నారు. గోదావరి జిల్లాల తర్వాత ఉత్తరాంధ్ర జిల్లాల్లో యాత్ర ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. ముందస్తు ఎన్నికల వార్తల్ని వైసీపీ కొట్టిపారేస్తున్నా… ఖచ్చితంగా తెలంగాణతో పాటే ఉంటాయని ఎక్కువ మంది నమ్ముతున్నారు.
పవన్ కల్యాణ్ ఎన్నికల వరకూ ప్రజల్లోనే ఉండనున్నారు. గోదావరి జిల్లాల్లోనే ఓ స్థానం నుంచి ఆయన పోటీ చేసే అవకాశం ఉంది. ఇప్పటికే పొత్తులపై అంతర్గత కసరత్తు పూర్తి చేస్తున్నారని.. టీడీపీ, జనసేన పార్టీలు సీట్ల విషయంలో .. అభ్యర్థుల విషయంలోనూ ఓ అంచనాకు వస్తున్నాయని చెబుతున్నారు.