తెలంగాణ బీజేపీలో మార్పులు బీఆర్ఎస్ కోసం కాదని నిరూపించుకోవాల్సిన పరిస్థితి బీజేపీపై పడింది. బీజేపీతో అవగాహన ప్రకారమే.. బీఆర్ఎస్ ను ఇబ్బంది పెడుతున్న బండి సంజయ్ ను సాగనంపారన్న ప్రచారం ఎక్కువగా సాగుతోంది. బీజేపీలో జరిగిన అనూహ్య మార్పులతో ఎక్కువగా జరుగుతున్న ప్రచారం బీజేపీ, బీఆర్ఎస్ మధ్య అవగాహన కుదిరిందన్నదే.. కొన్ని పరిణామాల వల్ల ప్రజలు కూడా దీన్ని గట్టిగా నమ్ముతున్నారు. అందుకే.. బీజేపీ ఇప్పుడు ఎదుర్కోవాల్సిన మొదటి సవాల్.. బీఆర్ఎస్తో ఎలాంటి లోపాయికారీ ఒప్పందం లేదని ప్రజలను నమ్మించగలగడం.
మాటలతో చెబితే ప్రజలు నమ్మలేరు. చేతల్లో చూపించాలి. అవి ఎలాంటి చేతలనేది రాజకీయాల్లో పండిపోయిన బీజేపీ నేతలే నిర్ణయించుకోవాల్సి ఉంది. ఈ విషయంలో ఫెయిలయితే.. తెలంగాణలో బీఆర్ఎస్ బీ టీంగా ఉండిపోవాల్సి వస్తుంది. బండి సంజయ్ నాయకత్వాన్ని కొంత మంది వ్యతిరేకించారనేది నిజం. కానీ బీజేపీ హైకమాండ్ ఆ వ్యతిరేకత కారణంగా బండి సంజయ్ ను మారుస్తారని ఎవరూ అనుకోలేదు. బండి సంజయ్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత బీజేపీ అనూహ్యంగా పుంజుకుంది. గ్రామ స్థాయికి పార్టీని తీసుకెళ్లే ప్రయత్నాలు చేశారు. పాదయాత్ర ద్వారా పార్టీకి ఊపు తెచ్చారు.
అందుకే బండి సంజయ్ ను వ్యతిరేకించే వారిని సంతృప్తి పరిచేందుకు పదవులు ఇస్తారని ఇంకా మంకు పట్టు బడితే.. వేరే దారి చూసుకోమని చెబుతారని అనుకున్నారు. కానీ బండి సంజయ్ ను మార్చడం వల్ల.. ఇప్పుడు ఆయనపై సానుభూతి పెరుగుతోంది. ఆయనకు మద్దతుగా కొత్త నాయకత్వానికి వ్యతిరేకంగా మాట్లాడేవారి సంఖ్య పెరుగుతోంది. ఇప్పుడు అందర్నీ ఏకతాటిపైకి తీసుకు రావడం బీజేపీ ముందున్న అతి పెద్ద సవాల్ . ఏ మాత్రం తేడా వచ్చినా బీజేపీ పరిస్థితి తెలంగాణలో మొదటికి వస్తుంది.