ఎస్సీ, ఎస్టీలను ఉద్దరించేస్తున్నామని ప్రకటనలు చేసే వైసీపీ.. నిజానికి వారిని అణిచి వేసి .. భయం పుట్టించి తమ గుప్పిట్లో పెట్టుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఇప్పుడు ఉద్యోగులకూ అదే మార్క్ న్యాయం చేయబోతోంది. దీంతో ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులు మండిపడుతున్నారు. ఆంధ్రప్రదేశ్ సచివాలయ ఎస్సీ, ఎస్టీ ఎంప్లాయిస్ అసోసియేషన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమం చేస్తామని ప్రకటించింది. దీనికి కారణం.. . ఎన్సీ, ఎస్టీ ఉద్యోగుల ప్రమోషన్లలలో ఉన్న రిజర్వేషన్లను తొలగించడం.
2003లో అప్పటి టీడీపీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌లో ఎస్సీ, ఎస్టీలకు ప్రమోషన్లలలో రిజర్వేషన్లు కల్పించింది. దీనిని తిరిగి జగన్ సర్కార్ 2022లో మిడిల్ లెవెల్ ఆఫీసర్‌తో అడ్వైజర్ కమిటీ ఏర్పాటు చేసింది. ఆ కమిటీ ఇచ్చిన రిపోర్టును ప్రభుత్వం ఆమోదించింది. అందులో రిజర్వేషన్లను తొలగించాలని నిర్ణయించారు. దీంతో ఉద్యోగులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఈ కమిటీ రిపోర్ట్‌ను ప్రభుత్వం ఆమోదించటాన్ని వ్యతిరేకిస్తూ ఆంధ్రప్రదేశ్ సెక్రటేరియట్ ఎస్సీ ఎస్టీ ఎంప్లాయిస్ తీర్మానం చేశారు.
రాజ్యాంగం ద్వారా సంక్రమించిన ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల హక్కులను కాలరాయటాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రభుత్వ శాఖలలో ఉన్న ఎస్సీ, ఎస్టీ ఎంప్లాయ్ సంఘాలు అన్నీ కలిసి ఒక జేఏసీగా ఏర్పడాలని నిర్ణయం తీసుకున్నాయి. అయితే ఎస్సీ, ఎస్టీలను బ్లాక్ మెయిల్ చేయడానికి వారికి ఉన్న సౌకర్యాలుతొలగించి.. ఉద్యమం చేసిన తరవాత మళ్లీ కల్పించి పాలాభిషేకాలు చేయించుకుని ఆ వర్గానికి ఏదో చేశామన్న కలరింగ్ ఇవ్వడానికే ఇలా చేస్తున్నారన్న వాదన కూడా వినిపిస్తోంది.