Bhaag Saale Movie Telugu Review
Bhaag Saale Movie Telugu Review
Telugu360 Rating : 1.5/5
తొలి చిత్రం ‘మత్తు వదలరా’తో ఆకట్టుకున్నాడు శ్రీ సింహ.అయితే తర్వాత వచ్చిన తెల్లవారితే గురువారం, దొంగలున్నారు జాగ్రత్త సినిమాలు నిరాశ పరిచాయి. ఇప్పుడు ‘భాగ్ సాలే’ అనే డార్క్ క్రైమ్ కామెడీ చేశాడు. శ్రీ సింహ తొలి చిత్రం కూడా క్రైమ్ కామెడీనే. మరా సెంటిమెంట్ భాగ్ సాలే లో వర్క్ అవుట్ అయ్యిందా? శ్రీ సింహకి మరో విజయం దక్కిందా?
అర్జున్ (శ్రీ సింహ) మిడిల్ క్లాస్ కుర్రాడు. ఓ హోటల్ లో చెఫ్ గా పని చేస్తుంటాడు. తనకి చాలా పెద్ద కలలు వుంటాయి. రెస్టారెంట్ బిజినెస్ చేసి కోట్లు సంపాయించాలని ఊహల్లో ఉంటాడు. తను చాలా గొప్పింటి వాడినని, కోట్ల విలువ చేసే బిజినెస్ లు వున్నాయని మాయ మాటలు చెప్పి మాయ ( నేహ సోలంకి) ని ప్రేమిస్తాడు. కట్ చేస్తే.. శామ్యుల్ ( జాన్ విజయ్) ఓ డ్రగ్ స్మగ్లర్. తన గ్యాంగ్ తో చీకటి వ్యాపారం చేస్తుంటాడు. శామ్యుల్ కి ఓ వీర ప్రేమగాధ వుంటుంది. నళిని ( నందిని రాయ్) ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తాడు. ఆమె బీ గ్రేడ్ సినిమాల్లో హీరోయిన్. నళిని గతంలో ఓ జమిందార్ ఇంట్లో పని చేస్తుంటుంది. అక్కడ ఓ విలువైన ఉంగరం చూస్తుంది. అ ఉంగరం తెస్తేనే ప్రేమిస్తానని కండీషన్ పెడుతుంది. ఆ ఉంగరం కోసం వెదుకుతున్న సామ్యుల్.. అది మాయ తండ్రి దగ్గర వుందని తెలుసుకొని అతడ్ని కిడ్నాప్ చేస్తాడు. మాయ తండ్రిని శామ్యుల్ నుంచి కాపాడటానికి అర్జున్ ఎలాంటి ప్రయత్నాలు చేశాడు? అసలు ఉంగరం చరిత్ర ఏమిటి ? చివరికి ఆ ఉంగరం ఎక్కడికి చేరింది? అర్జున్ గురించి అసలు నిజం మాయ తెలుసుకుందా? శామ్యుల్ నుంచి అర్జున్ కుటుంబానికి ఎలాంటి చిక్కులు వచ్చాయి? ఇదంతా తెరపై చూడాలి.
ఓ ఉంగరం చుట్టూ నడిచే కథ ఇది. సిద్దు జొన్నల గడ్డ వాయిస్ ఓవర్ తో ఆ ఉంగరం చరిత్రని చెబుతూ కథ మొదలుపెడతారు. ఓ డార్క్ కామెడీకి ఉండాల్సిన సెటప్ భాగ్ సాలే కథలో వుంది. కానీ అది తెరపై చాలా నీరసంగా వచ్చింది. కథ మొదలుపెట్టడమే ఇంటర్వెల్ ఎపిసోడ్ లోని ఓ సీన్ ని ఆరంభంలో చూపించి అక్కడి వరకూ జరిగిన కథని చెప్పుకుంటూ వెళ్లారు.
హీరో పాత్ర వేదం సినిమాలో అల్లు అర్జున్ టైపులో వుంటుంది. తను చాలా రిచ్ అని కలరింగ్ ఇచ్చుకోవడం, గాల్లో మేడలు కట్టేయడం టైపు. మరోవైపు శామ్యుల్ గ్యాంగ్ రూపంలో ఎలాంటి ఆసక్తి లేని నాసిరకమైన వినోదంతో ఓ ట్రాక్ నడుస్తుంటుంది. ఈ రెండు ట్రాకులు కలవడం ఇంటర్వెల్. విరామం వరకూ పాత్రలు చేసిన ప్రయాణం ప్రేక్షకులకు పెద్ద ఆసక్తిని కలిగించదు. ఇందులో రింగ్ చుట్టూ నడిచే సన్నివేశాలు ఎక్సయిటింగా వుండాలి. ఆ రింగు చేతుల మారిన ప్రతిసారి ఎవరి దగ్గరికి వెళ్లుంటుందనే ఆసక్తి ఏర్పాడాలి. కానీ అది జరగలేదు.
ఫస్ట్ హాఫ్ తో పోల్చుకుంటే సెకండ్ హాఫ్ కూడా బో’రింగ్’ గానే మారిపోయింది. డార్క్ కామెడీ సినిమాల్లో హాస్యం చాలా సహజంగా పుట్టాలి. ఇందులో మాత్రం చాలా ఫోర్స్ద్ గా, నాసిరకం చేష్టలతో నవ్వించాలని చూశారు. అది మిస్ ఫైర్ అయ్యింది. కథని ఎక్కడికి తీసుకు వెళ్ళాలో అర్ధం కాక అక్కడక్కడే ఎలాంటి ఆసక్తి కలిగించకుండా తిప్పుతుంటారు. హీరో చేతి నుంచి రింగ్ వెళ్ళిపోయిన తర్వాత .. ఏం చేయాలో అర్ధం కాక నళినిని కిడ్నాప్ చేసే సీక్వెన్స్ ని తెరపైకి తెస్తారు. ఆ కిడ్నాప్ సీక్వెన్స్ అంతా మరీ పిల్లచేష్టలా వుంది. ఎన్టీఆర్, రామ్ చరణ్ మాస్క్ లు వేసుకొని ఆర్ఆర్ఆర్ డైలాగులు కొట్టినా లాభం లేకపోయింది.
ఒక విలువైన వస్తువు చుట్టూ కథని నడపడం ఇది వరకూ చాలా సినిమాల్లో చూశాం. అలాంటి సినిమాల్లోని సీక్వెన్స్ లనే నమ్ముకున్నారు తప్పితే .. ఇందులో కొత్తగా చూపించిన ఎలిమెంట్ అంటూ ఏదీ లేకపోవడం, కామెడీ వర్క్ అవుట్ కాకపోవడం ప్రధాన లోపం.
శ్రీ సింహ చలాకీగా చేశాడు. అర్జున్ పాత్రలో అల్లుకుపోయాడు కానీ ఆ పాత్రని ఆసక్తికరంగా రాసుకోలేదు. ఎమోషనల్ డైలాగులు చెప్పడంలో కొంచెం మెరుగుపడాలి. జాన్ విజయ్ కి కీలక పాత్రే దక్కింది కానీ ఆ పాత్ర కనెక్ట్ కాలేదు. తన పాత్ర తీర్చిద్దిన విధానం తెలుగు నేటివిటికీ దూరంగా వుంటుంది. మాయ పాత్రలో చేసిన నేహ సోలంకి ఓకే అనిపిస్తుంది. నళిని పాత్రని ఒక వ్యాంప్ లా ట్రీట్ చేశారు. హర్ష కామెడీ ఒక దశలో ఇరిటేషన్ తెప్పిస్తుంది. సుదర్శన్ ని కూడా సరిగ్గా వుపయోగించలేకపోయారు. ప్రామిస్ రెడ్డి పాత్రలో చేసిన సత్య కనిపించింది రెండు సీన్స్ లోనైన పర్వాలేదనిపిస్తాడు. రాజీవ్ కనకాల పాత్ర గ్రాఫ్ లో లేదు. తనతో చాలా డబుల్ మీనింగ్ డైలాగులు మాట్లాడించేశారు. హర్షణి ఓకే అనిపిస్తుంది. మిగతా పాత్రలకు అంత ప్రాధాన్యత లేదు.
పాటలు ఈ సినిమాకి అనవసరం. ఓ రెండు బిట్ సాంగ్స్ వస్తాయి కానీ అవి గుర్తుండవు. నేపధ్య సంగీతం కూడా ఆకట్టుకోదు. కెమరా పనితనం, నిర్మాణ విలువలు ఓకే అనిపిస్తాయి. డైలాగుల్లో డబల్ మీనింగ్ ఎక్కువైయ్యాయి. ఈ సినిమాకి ‘భాగ్ సాలే’ అనే టైటిల్ ఎందుకు పెట్టారో తెలీదు కానీ సినిమా చూస్తున్నపుడు చాలా సార్లు థియేటర్ నుంచి పారిపోవాలనిపిస్తుంది.