తెలుగుదేశం పార్టీ ప్రలోభాలు పెట్టి, బెదిరించి తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలను చాలా అక్రమమైన మార్గంలో వారి పార్టీలో చేర్చేసుకుంటున్నదంటూ వైఎస్సార్ కాంగ్రెస్ నాయకులు పదేపదే ఆరోపణలు గుప్పిస్తున్నారు. తెలుగుదేశం ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు చూసి, జగన్ వైఖరితో విసిగిపోయి ఆ పార్టీలోని ఎమ్మెల్యేలు అంతా తమ వైపు ఎగబడి వస్తున్నారంటూ పాలకపక్షం సన్నాయి నొక్కులు నొక్కుతున్నది. ఈ రెండు వర్గాలు ఇలాంటి వాదనలుచెప్పుకుంటూ ఉన్నప్పటికీ.. పాలకులనుంచి ప్రలోభాలు లేకుండా.. ప్రతిపక్షానికి చెందిన ఎమ్మెల్యేలు పార్టీ మారుతారని అనుకోవడం మాత్రం భ్రమ. ఆయా ఎమ్మెల్యేల స్థాయిని బట్టి ఎంతో కొంత రేంజిలో సదరు ప్రలోభాల పర్వం ముమ్మరంగా నడుస్తూనే ఉంటుంది.
అయితే ఇక్కడ సామాన్యుడికి కలుగుతున్న సందేహం ఏంటంటే… టోకుగా ఇంతమంది నాయకులను ప్రలోభ పెట్టడానికి తెలుగుదేశం శక్తులు ప్రయత్నిస్తున్నప్పుడు వారిలో కనీసం ఒక్కరైనా.. ఆ ప్రలోభాల గురించి సాక్ష్యాలను దొరకబుచ్చుకుని.. జగన్‌కు ఎందుకు అందజేయడం లేదు. తెలుగుదేశం ప్రలోభాల గురించి జగన్ ఈ రాష్ట్ర ప్రజల ముందు ససాక్ష్యంగా ఆరోపణలు చేయడానికి, తెలుగుదేశం వారి కుట్రలను బట్టబయలు చేయడానికి ఒక్కరు కూడా ఎందుకు సహకరించడం లేదు.. అనే ఆలోచన చేసినప్పుడు.. జగన్ పట్ల పూర్తి విశ్వాసంతో నూరుశాతం ఆయన కోసం నిబద్ధతతో పనిచేద్దాం, ఆయనకు విశ్వాసపాత్రుడిగా ఉందాం.. తెలుగుదేశం ప్రలోభాల సాక్ష్యాలు సేకరించి ఆయన చేతిలో పెడదాం అని అనుకునే వారు ఆ పార్టీలో ఒక్కరూ లేరా అనే కొత్త సందేహం కలుగుతోంది.
ఇప్పుడు టెక్నాలజీ చాలా మారిపోయింది. ఫోన్ కాల్స్‌లో ఎలాంటి ప్రలోభాలు చేసినా.. తక్షణం వాటిని రికార్డు చేసుకోవడానికి సవాలక్ష మార్గాలు వచ్చాయి. ప్రత్యక్షంగా నాయకులు ‘భేటీలు’ వేసి మభ్యపెట్టజూసినా.. ఎదుటి వ్యక్తికి తెలియకుండా సాంతం వీడియో రికార్డు చేయడానికీ బోలెడు మార్గాలున్నాయి. పైగా ఇలాంటి పనులు చేయదలచుకునే వారికి హైదరాబాదులో వెలుగుచూసిన ‘ఓటుకునోటు’ కేసు చాలా ఐడియాలను అందించింది. ఆ కేసులో పీటర్ , తెరాస ప్రభుత్వానికి నమ్మకస్తుడు గనుక.. తనకు వచ్చిన ప్రలోభాలను రికార్డు చేసి తెదేపాను బుక్ చేశాడు.
మరి ఇదేసీన్ను ఏపీ రాజకీయాలకు అప్లయి చేసి చూసుకుంటే.. ఇప్పటికి 8 మంది ఎమ్మెల్యేలు జారిపోయారు. వీరిలో ఒక్కరైనా తెదేపా ప్రలోభాలను రికార్డు చేసి., జగన్ చేతిలో ఆధారాలుగా పెట్టగలిగేంత నమ్మకస్తులు లేరా? అనే అనుమానం కలుగుతుంది. పార్టీ అధినేతగా జగన్ కనీసం తన సొంత పార్టీ ఎమ్మెల్యేల్లో ఆ పాటి నమ్మకస్తుల్ని తయారుచేసుకోలేకపోయారా? అనే జాలి కూడా కలుగుతుంది. అందుకే ”పోగా మిగిలిన వాళ్లే మనవాళ్లు” అంటూ నిర్వేదం ప్రకటిస్తున్న జగన్.. ఆ మిగిలిన వాళ్లనైనా సరే.. తనకు అత్యంత నమ్మకస్తులు అయ్యేలాగా అనుబంధం పెంచుకుంటే ఆయనకు మంచి భవిష్యత్తు ఉంటుంది అని జనం అనుకుంటున్నారు.