వైఎస్ రాజశేఖర్ రెడ్డి పుట్టిన రోజు సందర్భంగా ఇడుపుల పాయలో నివాళి అర్పించేందుకు కుటుంబమంతా వెళ్లడం సహజం. ఉదయం చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలు చేయడం.. తర్వాత వైఎస్ సమాధి వద్ద కూడా అందరూ కలిసి ప్రార్థనలు చేయడం కామన్ గా జరిగేది. కానీ ఈ సారి మాత్రం ఎవరికి వారే అన్నట్లుగా వెళ్తున్నారు. షర్మిల ఉదయం పూట నివాళికి ప్లాన్ చేసుకుంటే… జగన్ రెడ్డి ఆమె పులివెందుల నుంచి వెళ్లిపోయిన తర్వాతనే ఇడుపులపాయలో అడుగు పెట్టాలని నిర్ణయించుకున్నారు.
ఒక రోజు ముందే పులివెందులకు వచ్చిన షర్మిల తమ పేరుపై ఉన్న భూముల్ని కుమారుడి పేరిట రిజిస్ట్రేషన్ చేశారు. ఎస్టేట్ లో పని చేసే వ్యక్తి పేరుపై ఉన్న భూముల్ని కొనుగోలు చేస్తున్నట్లుగా కుమార్తె పేరుపై రిజిస్ట్రేషన్ చేశారు. తన పేరుపై ఆస్తులేమీ లేకుండా పిల్లలకు బదిలీ చేస్తున్నట్లుగా భావిస్తున్నారు. మరో వైపు తన పర్యటనను కవర్ చేయాలని ఆమె తరపున ప్రతినిధులు కడపలో మీడియా ప్రతినిధులందరికీ ఫోన్లు చేశారు. కానీ జగన్ రెడ్డి తరపున అధికారులు మాత్రం మీడియా పాసులు ఇవ్వబోమని.. అక్కడికి అనుమతి లేదని చెబుతున్నారు.
షర్మిల కార్యక్రమానికి సాక్షిలో కవరేజీ వచ్చే అవకాశం లేకపోవడంతో .. ఇతర మీడియాలో కవరేజీ కోసం ప్రయత్నిస్తున్నారు. అయితే అదీ కూడా దక్కకుండా జగన్ రెడ్డి మనుషులు ప్రయత్నిస్తూండటం ఆసక్తికరంగా మరింది.