విశాఖపట్నంలో వ్యక్తుల్ని భయపెట్టి డబ్బుల్ని దోచుకున్న ముఠాకు సీఐ స్వర్ణలత నేతృత్వం వహించినట్లుగా స్పష్టం కావడం పోలీసు వర్గాల్లో సంచలనం సృష్టిస్తోంది. ఆమెకు ఉన్న రాజకీయ సంబంధాలు, పోలీసు అధికారుల సంఘానికి ఉపాధ్యక్షురాలిగా ఉంటూ చేసిన ఘన కార్యాలపై పోలీసు శాఖలోనే అనేక ఆరోపణలు గుప్పుమంటున్నాయి. రాజకీయ నేతల ఆశీస్సులు, ప్రభుత్వ మెప్పు కోసం ఆమె .. రాజకీయ ప్రకటనలు కూడా చేసిన సందర్భాలు ఉండటంతో … సీఐ స్వర్ణలత గత నిర్వాకాలపై సోషల్ మీడియాపై విస్తృతంగా ప్రచారం జరుగుతోంది.
పోలీసులకు.. రాజకీయాలకు సంబంధం ఉండదు. రాజకీయ పరంగా ఏం జరిగినా పోలీసులు జోక్యం చేసుకోకూడదు. కానీ నేరుగా కమిషనర్ ఆఫీసులోనే .. పోలీసు అధికారుల సంఘం ఉపాధ్యక్షురాలు హోదాలో ప్రెస్ మీట్ పెట్టిన స్వర్ణలత.. మాజీ మంత్రి , తెలుగుదేశం పార్టీ సీనియర్ నేతపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. అది కూడా స్క్రిప్ట్ రాసుకుని వచ్చి పంచ్ డైలాగులు చెప్పారు. అధికార పార్టీ నేతలతో స్వర్ణలత మంచి సంబంధాలు కొనసాగించి.. సర్వీస్ పరంగా ఇబ్బందులు రాకుండా.. పోస్టింగ్‌ల లాబీయింగ్ కూడా చేస్తారని అంటున్నారు.
ఆమె ఇలా బెదిరించి డబ్బులు దోపీడీ చేసిన విషయం బయటకు వచ్చిన తర్వాత .. విశాఖలో ఓ కీలక ప్రజాప్రతినిధి ఆమెపై కేసు పెట్టకుండా ఉన్నత స్థాయిలో ఒత్తిడి తెచ్చారని చెబుతున్నారు. జిల్లా స్థాయిలో సాధ్యం కాకపోవడంతో.. రాష్ట్ర స్థాయి కీలక నేతతోనూ ఫోన్ చేయించారంటున్నారు. కానీ విషయం బయటకు రావడంతో స్వర్ణలతపై కేసు పెట్టక తప్పలేదు. సినిమాల్లో నటించాలన్న పిచ్చి ఉన్న స్వర్ణలత డాన్సులు నేర్చుకుటున్నారు. ప్రైవేటు వీడియోలు తీసుకున్నారు. ఓ సినిమాలో నటిస్తున్నారు. డబ్బులు కూడా ఆమె పెడుతున్నారని చెబుతున్నారు.
ఇటీవల వివాదాస్పదమైన ఓ రాజకీయ నేత అండదండలే ఆమెకు ఎక్కువగా ఉన్నాయని.. ఈ డబ్బుల మార్పిడి ముఠా ఇంతకు ముందు ఇలాంటివి ఏమైనా చేసిందా అన్న అనుమానాలు కూడా వస్తున్నాయి. స్వర్ణలతపై తప్పని సరి పరిస్థితుల్లో..అదీ కూడా బయట కు తెలిసిందన్న కారణంగా కేసు పెట్టారని.. అందుకే ఆమె ను ఏ 4గా పెట్టారన్న విమర్శలు వస్తున్నాయి ఇలాంటి అధికారుల్ని కఠినంగా శిక్షిస్తేనే.. వ్యవస్థపై ప్రజలకు భరోసా ఉంటుందని లేకపోతే నమ్మకం కోల్పోతారన్న అభిప్రాయాలు సామాన్యుల నుంచి వస్తున్నాయి.