కేసీఆర్ కుటుంబ అవినీతిపై కేంద్ర దర్యాప్తు సంస్థలు దృష్టి పెట్టాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రకటించారు. వరంగల్ లో నిర్వహించిన బహిరంగసభలో మాట్లాడిన మోదీ..తెలంగాణ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. తెలంగాణ ప్రభుత్వం రోజూ నాలుగు పనులే చేస్తోందన్నారు మోదీ. ఉదయం నుంచి సాయంత్రం వరకు మోదీని తిట్టడం మొదటి పని అయితే… కుటుంబ పార్టీని పెంచి పోషించడం రెండో పనిగా చెప్పారు మోదీ. తెలంగాణ ఆర్థిక వ్యవస్థను నాశనం చేయడం మూడో పనిగా పెట్టుకున్నారని ఆరోపించారు. నాల్గో పనిగా తెలంగాణను అవినీతిలో కూరుకుపోయేలా చేస్తున్నారని ధ్వజమెత్తారు.
గతంలో రెండు రాష్ట్రాల మధ్య అభివృద్ధి కోసం ఒప్పందాలు జరిగేవి అన్నారు. ఇప్పుడు రెండు రాష్ట్రాల మధ్య అవినీతి ఒప్పందాలు జరుగుతున్నాయని ఢిల్లీ, తెలంగాణ ప్రభుత్వాలపై విమర్శలు చేశారు. ఇక్కడ అధికారంలో ఉన్న ప్రభుత్వం కోట్ల రూపాయల అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటోందన్నారు మోదీ. అవన్నీ ఇప్పుడు బహిర్గతమయ్యాయని గుర్తు చేశారు. కుటుంబ పార్టీల పాలనలో తెలంగాణ కూరుకుపోతుందని ఏనాడు అనుకోలేదన్నారు మోదీ. కుటుంబ పార్టీల డీఎన్ఏ మొత్తం అవినీతి మయమే అన్నారు. జనాల నమ్మకాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వం వమ్ముచేసిందన్నారు. 9 ఏళ్లుగా బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తోందని ఆరోపించారు.
ఇటీవలి కాలంలో మారిన రాజకీయాలతో.. బీఆర్ఎస్, బీజేపీ ఒక్కటేనన్న ప్రచారం ఉద్దృతంగా సాగుతోంది. దీనికి చెక్ పెట్టేలా ప్రధాని మోదీ.. ఘాటుగా హెచ్చరికలు చేసేందుకు ప్రాధాన్యం ఇచ్చారు. కేంద్ర దర్యాప్తు సంస్థలు దృష్టి పెట్టాయని హెచ్చరించడం.. ఢిల్లీ లిక్కర్ స్కాంను కూడా ప్రస్తావించం ఆసక్తికరంగా మారింది. అయితే మాటలు కాదని..చేతలు చూపిస్తేనే. రెండు పార్టీల మధ్య ఏమీ లేదని ప్రజలు నమ్ముతారని.. లేకపోతే.. కష్టమనేనన్న అంచనాలు ఉన్నాయి. అయితే తాము బీఆర్ఎస్ ట్రాప్ లో పడటానికి సిద్దంగా లేమని.. తామేంటో చూపిస్తామని.. బీజేపీ నేతలంటున్నారు.