మంచి చేయకపోయినా పర్వాలేదు కీడు మాత్రం చేయకు అని.. రాజకీయ నాయకుల్ని ఉద్దేశించి ప్రజలు అనుకూంటూ ఉంటారు. కానీ ఇప్పటి రాజకీయ నాయకులు వ్యవస్థల్లోకి తెచ్చి పెడుతున్న వైరస్ .. ప్రజలకు ఎంత కీడు చేస్తుందో అంచనా వేయడం కష్టంగా మారింది. అందుకు ఏపీ పోలీసు వ్యవస్థ ప్రధాన సాక్ష్యంగా కనిపిస్తోంది. ఓ వైపు సెలక్టివ్ పోలీసింగ్ చేయడం ఓ అవలక్షణమైతే.. తమకు ఉన్న అధికారాలతో నేరుగా నేరాలకు పాల్పడుతూండటం మరో ఘోరం.
పోలీసు వ్యవస్థ పై ప్రజలకు సన్నగిల్లిన నమ్మకం
ఏపీలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా పోలీసులపై ప్రజలకు ఉండే నమ్మకాన్ని తగ్గకుండా చూసుకుంటారు. ప్రజలకు భద్రత కల్పించే విషయంలో వారు రాజీ పడరు. అందుకే.. పోలీసు వ్యవస్థ అంటే నేరస్తులకు భయం ఉంటుంది. కానీ.. గత నాలుగేళ్ల కాలంలో జరిగింది వేరు. పూర్తిగా నేరస్తులకు అడ్డగోలుగా అండగా ఉండటం ..బాధితులపైనే కేసులు పెట్టడంతో ప్రజలు పోలీస్ స్టేషన్ లో న్యాయం జరుగుతుందనే నమ్మకాన్ని కోల్పోయారు. దానికి కళ్ల ఎదుట ఎన్నో సాక్ష్యాలు కనిపిస్తున్నాయి. కానీ పోలీసులు మాత్రం… కళ్లు మూసుకుని ఉంటున్నారు.
సెలక్టివ్ పోలీసింగ్ అసలు వైరస్
ఓ నేరం జరిగితే అది చేసింది అధికార పార్టీనా… ప్రతిపక్ష పార్టీనా అన్నది చట్టానికి అనవసరం. ఆ ప్రకారం చర్యలు తీసుకోవాలి. కానీ జరుగుతోందేంటి… అత్యంత దారుణమైన హత్య జరిగినా అతను అధికార పార్టీ అయితే.. స్టేషన్ బెయిల్ ఇచ్చేంత దుర్మార్గమైన సెలక్టివ్ పోలీసింగ్ నడుస్తోంది. పట్ట పగలు ఇద్దరు ప్రజాప్రతినిధులపై హత్యాయత్నం జరిగితే స్టేషన్ ఇచ్చినప్పటి నుండి అదే జరుగుతోంది. ఈ నాలుగేళ్లలో ఎంత మంది బాధితులు నేరస్తులయ్యారో అంచనా వేయడం కష్టం. ఎన్ని సార్లు డీజీపీ హైకోర్టు మెట్లెక్కి వివరణ ఇవ్వాల్సి వచ్చిందో కూడా చెప్పలేం. చివరికి కోర్టు సిబ్బందిపైనే అక్రమ కేసు పెట్టి బెదిరించాలని చూసిన దుస్థితి. ప్రజలు ఇంకెవరికి చెప్పుకుంటారు.
ఇప్పుడు పోలీసులే కరుడుగట్టిన నేరస్తులుగా మారుతున్న వైనం !
రాజకీయ అండ ఉంది… ఖాకీ డ్రెస్ ఉంది.. ఇక తాము ఏం చేసినా చెల్లిపోతుందనే పోలీసు లు పెరిగిపోతున్నారు. ఫలితంగా వారే నేరస్తులుగా మారుతున్నారు . ఓ ముఠాగా ఏర్పడి డబ్బులు దోచుకుదామనే ఆలోచన సీఐకి వచ్చిందంటే… అది వ్యవస్థలో వచ్చిన లోపం కాదా ? . రాజకీయ నేతలతో సంబంధాలు పెట్టుకుని నేరాలకు పాల్పడుతున్న పోలీసులు లెక్క లేనంత మంది. పోలీసు వ్యవస్థని నిర్వీర్యం చేయడం వల్ల రాజకీయంగా అధికార పార్టీకి మేలు జరుగుతుదో లేదో కానీ.. అలా చేయడం ప్రజల్ని ఘోరంగా మోసం చేయడమే. దాని ఫలితాలు తర్వాత ఎంత దారుణంగా ఉంటాయో అంచనా వేయడం కష్టం.