బీఆర్ఎస్ పార్టీ ఏర్పాటు చేసినప్పుడు కేసీఆర్ తో పాటే ఉన్న… జేడీఎస్ పార్టీ ఇప్పుడు బీజేపీకి దగ్గరయింది. కుమారస్వామి అసెంబ్లీ ఎన్నికల్లో దెబ్బతినడంతో .. ఇక జాతీయ రాజకీయాల్లో బీజేపీతో కలిసి ఉండటం మంచిదనుకుంటున్నారు. ప్రధాని నరేంద్రమోదీ తోనే నేరుగా దేవెగౌడ ‘టచ్’లో ఉన్నారు. 2024 లోక్సభ ఎన్నికల్లో బీజేపీతో కలసి పోటీ చేయాలని సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకున్నారు. కొద్దిరోజులుగా బీజేపీ, జేడీఎస్ నేతలు పరస్పరం ప్రశంసలు గుప్పించుకుంటున్నాయి.
మాజీ ముఖ్యమంత్రి హెచ్డి కుమారస్వామి ఇటీవల ఢిల్లీకి వెళ్లి బిజెపి జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డా , కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సహా బిజెపి అగ్రనేతలను కలిశారు. 2024 లోక్సభ ఎన్నికలకు బీజేపీతో జేడీ(ఎస్) పొత్తు పెట్టుకుంటుందన్న ఊహాగానాలు అప్పట్నుంచే ప్రారంభమయ్యాయి. పద్దెనిమిదో తేదీన ఎన్డీఏ మీటింగ్ జరగనుంది ఆసమావేశానికి జేడీఎస్ హాజరయ్యే అవకాశం ఉంది.
ఆలోక్సభ ఎన్నికల్లో బీజేపీ, జేడీఎస్ మధ్య పొత్తు కుదిరితే కనీసం 6 లోక్సభ స్థానాల నుంచి పోటీ చేసే అవకాశం ఉంది.
2019లోక్సభ ఎన్నికల్లో రాష్ట్రం నుంచి బీజేపీ 25 స్థానాలు గెలుపొందగా కాంగ్రెస్, జేడీఎస్ తలా ఒక స్థానాన్ని కైవసం చేసుకున్నాయి. అప్పటి ఎన్నికల్లో తుమకూరు నుంచి పోటీ చేసిన దేవెగౌడ కూడా ఓటమి పాలయ్యారు. వచ్చే ఎన్నికల్లోనూ అలాంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే… బీజేపీ తో జట్టు కట్టాలనుకుంటున్నారు. కాంగ్రెస్ ఇప్పుడు జేడీఎస్ ను కలుపుకునే స్థితిలో లేదు.