రేటింగ్ : 2.0
కంటెంట్, కాన్సెప్ట్ ఓరియెంటెడ్ చిత్రాలు తీసి విలక్షణ దర్శకుడిగా పేరు తెచ్చుకున్నారు నీలకంఠ. ఆయన సినిమాలు విమర్శకులు ప్రశంసలు దక్కించుకున్నాయి. `షో` చిత్రానికి గానూ జాతీయ అవార్డు అందుకున్నారు. `మిస్సమ్మ`కూడా ఆయన కెరీర్ లో మరో గుర్తుండిపోయే చిత్రం. అయితే ఏవో కారణాల వలన ఆయన కెరీర్ మాత్రం జోరందుకోలేదు. ఆయన నుంచి సినిమా వచ్చి దాదాపు దశాబ్దం అయిపోతుంది. ఐతే ఎట్టకేలకు ఆయన దర్శకత్వం వహించిన ‘సర్కిల్’ సినిమా ప్రేక్షకుల ముందుకువచ్చంది. మరి ఇంత విరామం తర్వాత ఆయన నుంచి వచ్చిన ఈ చిత్రం ఎలా సాగింది ? నేటి తరగానికి ఆకట్టుకొనేలా ఈ చిత్రాన్ని మలిచారా ? మరోసారి తన ప్రత్యేకతని చాటారా?
కైలాష్ (సాయి రోనక్) ఓ ప్రముఖ ఫోటోగ్రాఫర్. సెలబ్రిటీ ఫోటోగ్రాఫర్‌గా ఎదగాలని కలలు కంటాడు. ఐతే ఎదో కారణంగా తాగుడుకి బానిస అవుతాడు. ఓ రోజు ఫుల్లుగా తాగి ఇంట్లోకి వెళ్లగా, కిరాయి హంతకుడు పొత్తూరి గణేష్(బాబా భాస్కర్) కైలాష్ పై దాడి చేసి చైర్ లో బంధిస్తాడు. ఐతే గణేష్ కి ఒక నియమం వుంటుంది. తనను చంపేందుకు ఎవరు సుపారి ఇచ్చారో గెస్ చేస్తే అతనితో ఫోన్లో మాట్లాడించి ఇద్దరికీ రాజీ కుదిరితే వదిలేస్తానని చెప్తాడు. దీంతో కైలాష్ అసలు తనని చంపే అవసరం ఎవరికి ఉంటుందని ఆలోచిస్తూ తన మాజీ లవర్స్ అరుంధతి(రిచా పనాయ్) మాళవిక(అర్షిత్ మెహతా), హిమాని (నైనా) లతో జరిగిన ప్రేమకథలని గుర్తు చేసుకుంటాడు. ఈ మూడు ప్రేమకథలు ఎలా సాగాయి? అసలు కైలాష్ ఈ ముగ్గురితో ఎందుకు విడిపోయాడు? కైలాష్ని చంపేందుకు పొత్తూరి గణేష్‌కి సూపారీ ఇచ్చిందెవరు? అనేది తక్కిన కథ.
ఒక క్లైమాక్స్ ట్విస్ట్ పై ఆధారపడి కొన్ని సినిమాలు వస్తుంటాయి. సర్కిల్ కూడా అదే తరహ సినిమా. చివర్లో వచ్చే ట్విస్ట్ ని బలంగా నమ్మిన దర్శకుడు.. అది ఒక్కటి సరిపొతుందని భావించిననట్లు స్పష్టంగా అర్ధమౌతూ వుంటుంది. ఐతే ఇప్పుడు సినిమాని చూసే విధానం మారిపోయింది. కేలవం ఒక ట్విస్ట్ ని నమ్ముకొని సినిమా అంతా సన్నివేశాలు పేర్చుకుంటూ వెళితే ఒక దశలో ప్రేక్షకుడికి .. ఆ చివరి మలుపు కోసం ఇంత డ్రామా ఎందుకనే ఫీలింగ్ కలుగుతుంది. సర్కిల్ లో కూడా అదే జరుగుతుంది.
సక్సెస్ థ్రిల్లర్ జోనర్ సినిమా ఇది. తనని చంపడానికి ఎవరు సుపారీ ఇచ్చారనే గెస్సింగ్ నేపధ్యంలో తన మూడు ప్రేమకథలు నింపాదిగా చెప్పుకుంటూ వెళ్తాడు హీరో. ఈ మూడు కథలలో రెండు కథలు మరీ నీరసంగా సాగదీత ధోరణితో వుంటాయి. ఐతే అసలు కథకు సంబంధం లేకుండా ఈ మూడు కథల్లో రోమాన్స్ కావాల్సినదాని కంటే ఎక్కువ మోతాదు ఇచ్చుకుంటూ వెళ్ళిపోయాడు దర్శకుడు. బహుశా ఈ జనరేషన్ ఇలాంటి రోమాన్స్ కే ఇష్టపడుతుందనేది దర్శకుడి అలోచన కావచ్చు. ఐతే ఆ రోమాన్స్ అసలు కథని ముందుకు తీసుకువెళ్ళడానికి మాత్రం పని చేయలేదు.
క్లైమాక్స్ ట్విస్ట్ మీద ఆధారపడి కథ నడుపుతున్నపుడు ప్రేక్షకులని ఆసక్తిని చివరివరకూ కొనసాగించే సన్నివేశాలని అల్లుకుంటూ వెళితే బావుండేది కానీ ఇందులో అలాంటి ప్రయత్నం కనిపించలేదు. మూడో ప్రేమకథ ఐతే రొటీన్ బోరింగ్ వ్యవహారంగా మారుతుంది. దీంతో క్లైమాక్స్ లో ట్విస్ట్ ఫర్వాలేదనిపించినా అప్పటికే ప్రేక్షకుల్లో నీరసం ఆవహించేసివుంటుంది. చివర్లో ప్రాణం విలువ గురించి దర్శకుడు ఇచ్చే సందేశం లాంటి సన్నివేశం మాత్రం ఆలోచింపచేసేలానే వుంటుంది.
సాయిరోనక్ నటన డీసెంట్ గా వుంది. తనకి మూడు ప్రేమ కథల్లో మూడు షేడ్స్ చూపించే అవకాశం దక్కింది. బాబా భాస్కర్ మాస్టర్ నటన బావుంది కానీ ఆ పాత్రకు ఆయన ఇమేజ్ మ్యాచ్ కాలేదనిపించింది. హీరోయిన్లుగా చేసిన రిచా పనయ్, అర్షితా మెహతా, నైనా.. నటన మాట పక్కన పెడితే గ్లామరస్ గా కనిపించారు. మిగతా పాత్రలు పరిధిమేర వున్నాయి. గుర్తుపెట్టుకునే పాటలైతే లేవు.నేపధ్య సంగీతం ఓకే అనిపిస్తుంది. రంగనాత్ గోగినేని కెమెరా వర్క్ డీసెంట్ గా వుంది. కథకు తగ్గ ఖర్చు చేశారు. నీలకంఠ అంటే డిఫరెంట్ స్క్రీన్ ప్లే మ్యాజిక్. అలాంటి స్క్రీన్ ప్లే గమ్మత్తు మాత్రం సర్కిల్ లో లేదు.
రేటింగ్ : 2.0