దర్శక ధీరుడు రాజమౌళి డ్రీమ్ ప్రాజెక్ట్ మహాభారతం. ఈ గాధని ఓ పది భాగాలుగా రూపొందించి, ఇక రిటైర్ అయిపోవచ్చన్న ప్రణాళికల్లో ఉన్నారు రాజమౌళి. మహేష్ బాబుతో ఓ సినిమా రూపొందిస్తున్నాడు జక్కన్న. అది పూర్తయిన వెంటనే తన డ్రీమ్ ప్రాజెక్టు మొదలయ్యే అవకాశాలు ఉన్నాయి. అయితే ఈలోగా ఈ ప్రాజెక్టుకు సంబంధించిన కసరత్తులు గప్ చుప్‌గా మొదలు పెట్టేశారు. జక్కన్న ప్రస్తుతం పుణ్యక్షేత్రాల సందర్శనలో బిజీగా ఉన్నారు. రోడ్ ట్రిప్ వేస్తూ, తమిళనాడులోని ప్రముఖ దేవాలయాలను సందర్శించారు రాజమౌళి. ట్రిప్ బాగా జరిగిందని, దేవాలయాల్లోని శిల్ప కళ చూసి ఆశ్చర్యపోయానని, ఈ ట్రిప్‌లో భోజనం కూడా బాగా ఎంజాయ్ చేశానని, మూడు కిలోలు పెరిగానని, తన ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు. రోడ్ ట్రిప్ లో దేవాలయాల్ని సందర్శించాలన్నది తన చిరకాల వాంఛ అని పేర్కొన్నారు.
రాజమౌళికి ఆధ్యాత్మికత ఎక్కువే. అయితే.. ఈ ట్రిప్ వెనుక మహాభారతం ప్రాజెక్టుకు సంబంధించిన లింక్ కూడా ఉందని టాక్. దేవాలయాల్ని సందర్శించినప్పుడు, ఆ ఆలయాల గొప్పదనం, చరిత్ర, శిల్ప కళా నైపుణ్యం వీటి గురించి రాజమౌళి క్షుణ్ణంగా వాకబు చేస్తున్నట్టు తెలుస్తోంది. మహాభారతం స్క్రిప్ట్ రిసెర్చ్‌లో ఈ పర్యటన కూడా ఓ భాగం అని ఇన్ సైడ్ వర్గాలు చెబుతున్నాయి. సోషల్ మీడియాలో జక్కన్న ఫ్యాన్స్ కూడా ఇదే విజయమై ఆరా తీస్తున్నారు. మహా భారతం ప్రాజెక్టుకు సంబంధించిన కసరత్తులు అప్పుడే మొదలు పెట్టేశారా? అంటూ రాజమౌళిని ఆరా తీస్తున్నారు.