దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి రాజకీయ జీవితాన్ని ‘యాత్ర’ సినిమాలో ఆవిష్కరించే ప్రయత్నం చేశాడు దర్శకుడు మహి రాఘవ. వైఎస్ రాజకీయ ప్రయాణంలోని కొన్ని ముఖ్య ఘట్టాలకు కొంత కల్పన జోడించి గత ఎన్నికల ముందుకు యాత్రని ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చాడు. ఈసారి ఎన్నికల ముందు యాత్ర 2ని రెడీ చేస్తున్నాడు. ఇందులో ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రాజకీయ ప్రయాణం చూపించబోతున్నాడు. జగన్ సిఎం అయ్యేవరకూ జరిగిన కీలక పరిణామాలు ఇందులో ఉంటాయని చెబుతున్నాడు దర్శకుడు.
ఐతే యాత్రతో పోల్చుకుంటే యాత్ర2 దర్శకుడికి సవాల్ కానుంది. వైఎస్ తో పోల్చుకుంటే జగన్ జీవితంలో చాలా డ్రామా వుంది. కొన్ని వివాదాస్పద సంఘటనలు వున్నాయి. జగన్ కాంగ్రెస్ పార్టీ ని ధిక్కరించడం, పార్టీ పెట్టడం, పాదయాత్ర చేయడం, అక్రమ ఆస్తుల కేసులో జైలుకి వెళ్ళడం ఒక ఎత్తయితే.. సరిగ్గా ఎన్నికలకు ముందుకు జగన్ కుటుంబంలో జరిగిన బాబాయ్ వివేకానంద రెడ్డి దారుణ హత్య పెను సంచలనం. దేశవ్యాప్తంగా ఈ హత్య వార్తల్లో నిలిచింది. ప్రస్తుతం కేసుని సిబిఐ విచారిస్తోంది. మరి ఇంత కీలకమైన సంఘటనని యాత్ర 2లో చూపిస్తారా లేదా అనే ఇప్పుడు ప్రశ్న.
అలాగే కోడికత్తి కేసు కూడా తెలుగు రాష్ట్రాల్లో చాలా పాపులర్. దీనికి వెనుక సూత్రధారులు ఎవరనేది చాలా ఆసక్తికరం. మరి ఈ కేసుని టచ్ చేస్తారా లేదా చూడాలి. మొత్తానికి యాత్రని ఎలాంటి చిక్కులు లేకుండా డీల్ చేసుకుంటూ వెళ్ళిన దర్శకుడు మహికి ‘యాత్ర 2’ మాత్రం ఒక సవాలే. ఐతే ఎలాంటి వివాదాలు కాకుండా కేవలం అనుకూలమైన అంశాలనే చిత్రీకరించుకుంటూ వెళితే మాత్రం… సినిమాగా కాకుండా కేవలం ప్రచార చిత్రంగా ముద్రపడే ప్రమాదం వుంది. మరి మహి రాఘవ ఎలాంటి అంశాలని టచ్ చేస్తాడో చూడాలి.