తమిళనాట రాజకీయంగా కొంత వ్యాక్యూమ్ ఉంది. అది సూపర్ స్టార్ రజనీకాంత్ తో ఫిల్ అవుతుందని అంతా ఆశించారు. కానీ… రజనీమాత్రం వస్తా.. వస్తా అంటూనే రాజకీయాలకు హ్యాండ్ ఇచ్చారు. దాంతో వాక్యూమ్ అలానే ఉండిపోయింది. ఆ గ్యాప్ ఇప్పుడు విజయ్‌తో తీరబోతోందన్న ఆశలు చిగురించాయి. తమిళ రాజకీయాల్లో విజయ్ అడుగుపెట్టబోతున్నాడంటూ చాలాకాలంగా వార్తలు వినిపిస్తున్నాయి. విజయ్ ఈ విషయంపై ఎప్పుడూ నోరు మెదపలేదు. కానీ… తెర వెనుక ఆయన అందుకు తగిన సన్నాహాలు ఎప్పుడో మొదలెట్టేశారు. తాజాగా ఆయన పాద యాత్ర చేయాలన్న నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. ఈ విషయమై తమిళ పత్రికలతో పాటు, జాతీయ మీడియా కూడా కథనాల్ని ప్రచురిస్తోంది. ఈ వార్తలు తమిళ నాట సంచలనం రేపుతున్నాయి. మంగళవారం విజయ్ తన అభిమానులతో భేటీ వేశారు. ఈ సందర్భంగా పాత యాత్రపై కూలంకుశంగా చర్చించినట్టు తెలుస్తోంది. విజయ్ తాజా చిత్రం `లియో` షూటింగ్ పూర్తయింది. ఈ సినిమా విడుదలకు ముందే ప్రజల్లోకి వెళ్లాలని విజయ్ నిర్ణయించుకొన్నట్టు తెలుస్తోంది. పాద యాత్ర ఎక్కడ మొదలెట్టాలి? ఎన్ని రోజుల్లో పూర్తి చేయాలి? అనే విషయాలపై ఆయన లోతుగా చర్చించినట్టు తెలుస్తోంది. దీన్ని బట్టి విజయ్ రాజకీయ రంగ ప్రవేశం ఖాయమన్న ఊహాగానాలకు మరింత బలం చేకూరినట్టైంది. విజయ్ పార్టీ పెట్టినా, వేరే పార్టీలో చేరినా… రాజకీయంగా తమిళనాట పెను మార్పులు చోటు చేసుకోవడం ఖాయమన్నది విశ్లేషకుల మాట.