రేవంత్ రెడ్డి అమెరికాలో ఉచిత విద్యుత్ విషయంలో అన్న కామెంట్లను బీఆర్ఎస్ చాలా యాక్టివ్ గా వివాదాస్పదం చేసి ధర్నాలు చేసేస్తోంది. గతంలో బీజేపీపై ఇలాంటి ధర్నాలు చేసేవాళ్లు. ఇప్పుడు కాంగ్రెస్ పై చేస్తున్నారు..అదొక్కటే తేడా . అయితే ఈ ఇష్యూలోకి చంద్రబాబును, టీడీపీని కూడా తీసుకు రావడం మాత్రం కాస్త అనూహ్యంగానే ఉంది. చంద్రబాబు వ్యవసాయం దండగ అన్నారని.. తాము పండగ చేశామని..ఉచిత విద్యుత్ ను చంద్రబాబు వద్దన్నారన్నట్లుగా కేటీఆర్ చెప్పుకొచ్చారు. రేవంత్ టీడీపీ నుంచి వచ్చారని..ఆయన చంద్రబాబు చెప్పారనే ఇలా మాట్లాడారని అంటున్నారు.
ఏపీలో పవన్ కల్యాణ్ ఏం మాట్లాడినా ఆయన చంద్రబాబు చెబితే చెప్పారని ప్రచారం చేసినట్లుగా తెలంగాణలో రేవంత్ రెడ్డి ఏం అన్నా.. చంద్రబాబుకు లింక్ చేయడం రాజకీయవర్గాలకూ కాస్త ఆశ్చర్యకరంగా మారింది. దీంతో కేసీఆర్ గతంలో చంద్రబాబుతో ఉన్నప్పుడే ఉచిత విద్యుత్ గురించి.. చంద్రబాబు విద్యుత్ పాలసీ గురించి కేసీఆర్ అసెంబ్లీలోనే మాట్లాడిన వీడియోలు బయట పెట్టారు. వ్యవసాయం దండగ అన్న చంద్రబాబు వీడియోలు ఉంటే బయటపెట్టాలని కేటీఆర్ కు టీడీపీ సోషల్ మీడియా నుంచి సవాళ్లు వెళ్లాయి. ఇదంతా సరే కానీ..అసలు చంద్రబాబు ప్రస్తావన ఎందుకుకన్నది తెలంగామ రాజకీయవర్గాల్లో ఆసక్తికరంగా మారింది.
తెలుగుదేశం పార్టీ బీజేపీకి దగ్గరవుతోందని ఓ సారి విమర్శిస్తారు. ఖమ్మం సభ పెట్టినప్పుడు బీజేపీతో పొత్తు కోసమే అలా చేస్తున్నారన్నారు. ఇప్పుడు రేవంత్ రెడ్డితో లింక్ పెట్టారు. తెలంగాణలో చంద్రబాబు ఏదో తెలియని రాజకీయం చేస్తున్నారని బీఆర్ఎస్ నేతలు అనుమానిస్తున్నారని.. అదేమిటో అర్థం కాకే ఇలాంటి కామెంట్లు చేస్తున్నారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.