ఒక్క సారి ప్రజలు అధికారం ఇస్తే వారి హక్కులను అడ్డగోలుగా నరికేసి.. తామే శాశ్వతంగా అధికారంలో ఉండే నియంతలకు మొదటగా గుర్తొచ్చే అంశం.. తమకు అందలం ఎక్కించిన వారి ఓటు పవర్ ను రద్దు చేయడం. అదే చేస్తే..ఇక శాశ్వతంగా అధికారంలో ఉండవచ్చని ఆశపడుతూంటారు. కానీ అలా చేయడం తమ కాళ్లు తాము నరుక్కోవడం అవుతుందని.. గుర్తించరు. అలాంటి పాలకులకు ఎలాంటిదుర్గతి పడుతుందో ప్రపంచంలో చాలా దేశాలు చూశాయి. దురదృష్టవాశాత్తూ పాఠాలు నేర్చుకోని పాలకులు ఎప్పటికప్పుడు వెలుగు చూస్తూనే ఉన్నారు.
ఏపీలో ఇటీవలి కాలంలో ఓటర్ జాబితా ప్రహసనం చూసిన తర్వాత ఎవరికైనా …. ఈ ఎన్నికలు జరగడానికేనా అన్న అనుమానం రాకుండా ఉండదు. 175 గెలిచేస్తాం అంటూంటే.. ఏదో అనుకున్నారు.. డబ్బులిచ్చి సర్వేలు వేయించుకుంటూంటే పెద్ద కథే ఉందనుకున్నారు. ఆ కథ… ఓటర్లు. తమకు ఓటేయరు అనుకున్న వారి ఓట్లను తీసేయడం… దొంగ ఓట్లను చేర్చడం… ఈ పథకంలో భాగం. బయటకు వచ్చే వరకూ చేయాల్సినదంతా చేశారు. ఇప్పుడు బయటకు వచ్చాక.. దేశమంతా నివ్వెరపోయింది. ఎన్నికల ఆధికారులు కూడా.. తప్పు జరిగిపోయిందని ఒప్పుకోవాల్సి వచ్చింది. కానీ ఇప్పుడు వారు సరిదిద్దుకుంటారా లేదా అన్నది కీలకం.
స్వయంగా ప్రభుత్వ పెద్దలే ఇందులో ఉన్నారని స్పష్టత రావడంతో ఢిల్లీ సీఈసీ రంగంలోకి దిగింది. ఇంత దారుణంగా ఓటర్ల జాబితాలో మార్పు చేర్పులు ఎలా సాధ్యమని రాష్ట్ర ఎన్నికల అధికారిని నిలదీసింది. ఆయనను ఢిల్లీ పిలిపించింది. ఓటర్ కు ఆధార్ సీడింగ్ చేసిన తర్వాత కూడా ఇన్ని అక్రమాలు చేయడం సహించరాని నేరంగా చెబుతున్నారు. అయితే ఏపీ సీఈవో.. ఇప్పుడు ఏం చేస్తారన్నదే కీలకం. ఏం చెప్పినా… అక్రమాలు సరి చేస్తారా.. చేసినట్లుగా ప్రకటించుకుని నిమ్మకు నీరెత్తినట్లుగా ఉంటారో చూడాల్సి ఉంది.
ఎలా చూసినా ఓటర్ల జాబితాలో అక్రమాలతే.. పకడ్బందీగా ప్రజాస్వామ్య హత్యకు కుట్ర పన్నినట్లుగా సులువుగా అర్థమవుతోంది. ఇప్పుడు ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఏర్పడింది.