ప్రైవేటు విద్యా రంగంలో శిఖరంలా ఎదిగిన శ్రీ చైతన్య విద్యాసంస్థల ఫౌండర్, ఛైర్మన్ డాక్టర్ బొప్పన సత్యనారాయణ రావు హఠాత్తుగా కన్నుమూశారు. ఈ ఉదయం బాత్ రూమ్ లో జారిపడటంతో ఆయనకు తీవ్ర గాయాలయ్యారు. వెంటనే ఆస్పత్రికి తరలించినా ప్రయోజనం లేకపోయింది. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు. బీఎస్ రావుకు ప్రసిద్ధుడైన ఆయన చైతన్య విద్యా సంస్థల్లో చదువుకున్న లక్షలాది మంది విద్యార్థులకు మార్గదర్శిగా నిలిచారు.
బీఎస్ రావు భౌతిక కాయాన్ని స్వస్థలం అయిన విజయవాడకు తరలించారు. శుక్రవారం 4 విజయవాడలో బీఎస్ రావు అంత్యక్రియలు జరగనున్నాయి. బొప్పన సత్యనారాయణ రావు తొలినాళ్లలో యూకే, ఇరాన్ లో డాక్టర్ గా పని చేశారు. అనంతరం భార్యతో కలిసి 1986లో శ్రీ చైతన్య విద్యాసంస్థలను స్థాపించారు. అందులో భాగంగా తొలుత విజయవాడలోనే తొలి జూనియర్ కాలేజీని పెట్టారు. విజయవాడ నుంచి నెమ్మదిగా తమ కాలేజీలను పెంచుకుంటూ పోయారు. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా వీరి కాలేజీలు నెలకొల్పారు.
ప్రస్తుతం దేశవ్యాప్తంగా మొత్తం 321 జూనియర్ కాలేజీలు, 322 శ్రీ చైతన్య టెక్నో స్కూళ్లు, 107 సీబీఎస్ఈ స్కూళ్లను వీరు నడుపుతున్నారు. 37 ఏళ్ల నుంచి లక్షలాది మంది చైతన్య నుంచి విద్యావంతులై.. ప్రపంచ్యాప్తంగా ఎన్నో ఉన్నత స్థానాలను అధిరోహించారు. పాత చైతన్య విద్యార్థులందరికీ బీఎస్ రావు మరణం మనోవేదనకు గురి చేస్తోంది.