దేశంలో పది రాజ్యసభ స్థానాలకు ఎన్నికల నోటిఫికే షన్ విడుదల అయింది. బీజేపీ ఆరు స్థానాల్లో బీజేపీ గెలిచే అవకాశం ఉంది. దీంతో ఏదో ఒక రాష్ట్రం నుంచి తెలంగాణ బీజేపీ నేత ఒకరికి అవకాశం ఇవ్వొచ్చనే ప్రచారం ఊపందుకుంటోంది. మాజీ ఎంపీలు గరికపాటి మోహన్‌రావుతో పాటు వివేక్ పేర్లు ఎక్కువగా ప్రచారంలోకి వస్తున్నాయి. పార్టీలో చేరి చాలా కాలమైనా .. పార్టీ బలోపేతం కోసం ఎంత కష్టపడినా ప్రయోజనం లేదన్న భావన ఎక్కువ మంది సీనియర్లలో ఉంది.
గరికపాటి మోహన్ రావు టీడీపీ క్యాడర్ ను బీజేపీలో చేర్చడంలో కీలక పాత్ర పోషించారు. ఆయనకు రాజ్యసభ సభ్యత్వం రెన్యూవల్ చేస్తామని హామీ ఇచ్చారు. కానీ ఇప్పటి వరకూ చేయలేదు. అలాగే మాజీ ఎంపీ వివేక్ కూడా రాజ్యసభ సీటు ఆశిస్తున్నారు. రాజ్యసభ సభ్యుడిగా ఉన్న గరికపాటి మోహన్‌రావు సైతం 2020లో బీజేపీలో చేరారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌తో కలిసి బీజేపీని తెలంగాణలో బలోపేతం చేయటంలో గరికపాటి కీలక పాత్ర పోషించారు. దుబ్బాక, హుజూరాబాద్ ఉప ఎన్నికలతో పాటు జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ గెలుపు కోసం తెర వెనుక ప్రయత్నాలు చేశారు.
ఎస్టీ రిజర్వు అసెంబ్లీ నియోజకవర్గాల ఇన్చార్జి బాధ్యతలను కూడా ఆయన నిర్వరిస్తున్నారు. ఏప్రిల్‌లో ములుగు అసెంబ్లీ నియోజకవర్గ స్థాయి సమావేశాన్ని భారీగా నిర్వహించారు. ఏజెన్సీలో కూడా బీజేపీని బలోపేతం చేసేందుకు కృషి చేస్తు న్నారు. 2022లో గరికపాటి రాజ్యసభ పదవి కాలం ముగిసింది. ఆ తర్వాత ఆయన్ను ఉత్తరప్రదేశ్ నుంచి రాజ్యసభకు పంపిస్తారనే ప్రచారం జరిగింది. అయితే బీజేపీ సీనియర్ నేత లక్ష్మణ్‌కు యూపీ నుంచి అవకా శం ఇవ్వటంతో గరికపాటికి చాన్స్ మిస్సయ్యింది.
అసెంబ్లీ ఎన్నికల ముందే గరికపాటిని రాజ్యసభకు పంపిస్తే హైదరాబాద్‌లో ఉన్న కమ్మ సామాజికవర్గం ఓటర్లు బీజేపీ వైపు ఆకర్షించొచ్చని అధిష్ఠానం అంచనా వేస్తున్నట్టు సమాచారం. అలాగే ఖమ్మం జిల్లాలో కూడా పట్టు సాధించొచ్చనే లెక్కలు వేస్తున్నట్టు తెలు స్తోంది. రాజ్యసభ ఎంపీగా తెలంగాణకు అవకాశం ఇస్తే మొదటి పేరు గరికపాటిదే అవుతుందనే చర్చ పార్టీ వర్గాలో వినిపిస్తోంది. అయితే అందరి కన్నా ముందు తాను పార్టీలో చేరానని తనకూ చాన్సివ్వాలని వివేకా ప్రయత్నాలు చేస్తున్నారు.