జనసేన అధినేత పవన్ కల్యాణ్ వారాహి యాత్ర చేపట్టారు. తాను రోడ్డెక్కితే ఎలా ఉంటుందో వైసీపీ నేతలకు చూపిస్తున్నారు. అంత వరకూ బాగానే ఉంది..కానీ పార్టీ పరంగా ఆయన తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారా అన్నది సందేహంగా మారింది. వైసీపీ, టీడీపీ అధినేతలు వచ్చే ఎన్నికల్లో అభ్యర్థుల విషయంపై పూర్తి స్థాయిలో కసరత్తు చేస్తున్నారు . ఎప్పటికప్పుడు ఇంచార్జుల్ని ప్రకటించడం.. వారు జోరుగా ప్రజల్లోకి వెళ్లడం వంటివి చేస్తున్నారు. అయితే జనసేన వైపు నుంచి అలాంటి కార్యాచరణ కనిపించడం లేదు.
పొత్తుల గురించి పక్కన పెడితే పవన్ కల్యాణ్ .. అన్ని నియోజకవర్గాల్లో తమ పార్టీ కార్యకలాపాలు జరిగేలా చూసుకోవాల్సి ఉంది. ఇందు కోసం ఇంచార్జుల్ని ప్రకటించి వారు జోరుగా ప్రజల్లోకి వెళ్లే సన్నాహాలు చేయాలి. కానీ జనసేనాధినేత వైపు నుంచి అలాంటి ప్రయత్నాలు జరగడం లేదు. బలమైన నేతలు ఉన్న అతి కొద్ది చోట్ల మాత్రమే అభ్యర్థులు కనిపిస్తున్నారు. భీమిలిలో పంచకర్ల, విజయవాడలో పోతిన మహేష్ , తిరుపతిలో కిరణ్ రాయల్ వంటివారు కనిపిస్తున్నారు., వారు అభ్యర్థులు అవునో కాదో తెలియదు కానీ.. పార్టీ కోసం గట్టిగానే పని చేస్తున్నారు.
అలాంటి నేతల్ని ఇతర నియోజకవర్గాల్లో పెంచుకోవడంలో… ఇంచార్జులుగా నియమించుకోవడంలో పవన్ కల్యాణ్ విఫలమయ్యారు. ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో టిక్కెట్ల ఖరారును వీలైనంతగా పూర్తి చేయాల్సి ఉంటుంది. టిక్కెట్లు దక్కక ఇతర పార్టీల నుంచి వలస వచ్చే వారికి చాన్స్ ఇస్తే… రాజోలు ఎమ్మెల్యే రాపాకలాగానే మారుతారు. అందుకే… ఈ సారి పవన్ జనసైనికులకే చాన్సిస్తే మంచిదన్న సలహాలు వినిపిస్తున్నాయి.