వైసీపీ నేతలు హఠాత్తుగా చిరంజీవిపై ప్రేమ పెంచుకుంటున్నారు. ఆయన చాలా గొప్ప అంటూ కథలు పోతున్నారు. ఇంటికి పిలిచి దండాలు పెట్టించుకుని ఆ వీడియోలు రిలీజ్ చేసుకుని పొందిన వికృతానందం… ఓ మెగాస్టార్ ను ఇంత ఘోరంగా అవమానిస్తారన్న ఆవేదన ఆయన అభిమాులు మర్చిపోతారని అనుకుంటున్నారేమో కానీ… చిరంజీవిని మాత్రమా వాడేసేందుకు ఏ మాత్రం వెనుకాడటం లేదు. మొన్న పోసాని.. చిరంజీవిని పొగిడాననుకుని అవమానించారు. ఇవాళ ఆ బాధ్యత ఎంపీ వల్లభనేని బాలశౌరి తీసుకున్నారు.
వల్లభనేని బాలశౌరి హఠాత్తుగా ఓ ట్వీట్ చేశారు.. అదేమిటంటే… ఓ గ్రామంలో కమ్యూనిటీ హాల్ కడుతున్నామని..దానికి చిరంజీవి పేరు పెట్టేస్తామని ఆయన ఔదార్యం చూపించారు. గుంటూరు జిల్లా కొల్లిపర మండలం చక్రాయపాలేంలో నూనతనంగా నిర్మించనున్న కమ్యూనిటీ హాలుకు చిరంజీవి పేరు పెడుతున్నట్లు వైసీపీ ఎంపీ వల్లభనేని బాలశౌరి ప్రకటించారు. మరుగుదొడ్డి కట్టినా రాజన్న, జగనన్న అని బోర్డులు పెట్టి విశ్వాసం చూపే వైసీపీ నాయకులు హఠాత్తుగా చిరంజీవి పేరు పెడతామనడం కాస్తంత వింతే.
అయితే ఆ కమ్యూనిటీ హాల్ కు నిధులిచ్చింది చిరంజీవే. ”2012-14 మధ్య కాలంలో చిరంజీవి కేంద్ర మంత్రిగా ఉన్న సమయంలో చక్రాయపాలేంలో కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి రూ. 25 లక్షలు మంజూరు చేశారు. అయితే, ఆ నిధులు సరిపోక పోవడంతో ఆ కమ్యూనిటీ హాల్ నిర్మాణం మధ్యలో ఆగిపోయింది. ఇక దాన్ని ఎవరూ పట్టించుకోలేదు. ఇప్పుడు పవన్ కల్యాణ్ దెబ్బకు ఎంపీకి మరోసారి గుర్తుకు వచ్చింది. చక్రాయపాలేం గ్రామాన్ని సొంత ఊరుగా భావిస్తానని… … రూ. 40 లక్షలు వెచ్చించి, మిగిలిన కమ్యూనిటీ హాల్ నిర్మాణాన్ని నాలుగు నెలల్లో పూర్తి చేస్తాం. ఆ కమ్యూనిటీ హాలుకు మెగాస్టార్ చిరంజీవి కమ్యూనిటీ హాల్ గా నామకరణం చేస్తామని చెప్పకొచ్చారు.
బాలశౌరి జగన్ వ్యాపార భాగస్వామి. జగన్ ను వదిలి చిరంజీవి వైపు పోతారని కాదు.. కానీ.. ఆయన పవన్ కల్యాణ్ చేస్తున్న ఎదురుదాడిని చిరంజీవితో అడ్డం పెట్టుకుని డ్యామేజ్ కంట్రోల్ చేసుకోవాలనుకుంటున్నారు. రాజకీయాలపై స్పందించకూడదని చిరంజీవి అనుకుంటూ ఉండటం తో వారి ఇష్టారాజ్యం అయిపోయింది.