నిరసన వ్యక్తం చేసన జనసేన పార్టీ కార్యకర్త పై దాడి చేసిన శ్రీకాళహస్తి సీఐ అంజూయాదవ్ వ్యవహారాన్ని కాళహస్తిలోనే తేల్చుకుంటానని పవన్ కల్యాణ్ ఇటీవల ప్రకటించారు. అయితే అందరూ అక్కడ వారాహి విజయ యాత్ర జరిగినప్పుడు తేల్చుకుంటారేమో అనుకున్నారు..కానీ పవన్ మాత్రం.. వెంటనే షెడ్యూల్ ఖరారు చేసుకున్నారు. సోమవారం ఆయన తిరుపతికి వెళ్తున్నారు. సీఐ అంజూయాదవ్ పై చర్యలు తీసుకోవాలని ఆయన ఎస్పీకి వినతి పత్రం ఇవ్వనున్నారు.
శనివారం మధ్యాహ్నం ఉమ్మడి చిత్తూరు జిల్లా నాయకులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఉదయం 9గం. 30ని.లకు రేణిగుంట విమానాశ్రయం చేరుకుంటారు. 10గం. 30ని.లకు జిల్లా ఎస్పీ కార్యాలయానికి వెళ్లి పవన్ కళ్యాణ్ వినతి పత్రం అందిస్తారు. పవన్ కళ్యాణ్ గారు పాల్గొనే ఈ కార్యక్రమాన్ని శాంతియుత, క్రమశిక్షణతో కూడిన వాతావరణంలో నిర్వహించేలా ఏర్పాట్లు చేయాలని పార్టీ శ్రేణులకు నాదెండ్ల మనోహర్ సూచించారు.
అయితే పవన్ కల్యాణ్ తిరుపతి నుంచి కార్యకర్తను పరామర్శించేందుకు శ్రీకాళహస్తి వెళ్లే అవకాశం ఉందని చెబుతున్నారు. పోలీసులపై ఫిర్యాదు కావడంతో..పోలీసులు ఎలా స్పందిస్తారన్నది ఆసక్తికరంగా మారింది. పవన్ పర్యటనను అడ్డుకుంటారా.. లేకపోతే ఎస్పీ వినతి పత్రం తీసుకుంటారా అన్నది సందేహంగా మారింది. అంజూయాదవ్ వ్యవహారశైలి తీవ్ర వివాదాస్పదం కావడంతో.. ఆమె తప్పించకపోతే పోలీసు వ్యవస్థపై నమ్మకం పోతుందన్న వాదన వినిపిస్తోంది. అయితే ఆమెకు వైసీపీ పెద్దల నుంచి పూర్తి సపోర్ట్ ఉండటంతో.. ఉన్నతాధికారులు ఏ చర్యలు తీసుకోలేకపోతున్నారు.