ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. రాజకీయాల్లో జంపింగ్ జిలానీలు రెడీ అయ్యారు. తాము ఉన్న పార్టీలో టిక్కెట్ ఉండదని తెలియగానే.. వెంటనే ఇతర పార్టీల్లో కర్చీఫ్ వేసుకోవడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారు. జనసేన పార్టీకి నియోజకవర్గ స్థాయి నేతలు లేరు. ఇదే అదనుగా ఎక్కువగా మంది జనసేన వైపు చూస్తున్నారు. పొత్తులు ఉంటే.. ఒత్తిడి చేసి అయినా కూటమిలో భాగంగా సీటును దక్కించుకోవచ్చని అనుకుంటున్నారు. ఇప్పటికే ఆమంచి స్వాములు చేరారు. పంచకర్ల రమేష్ వంటి వారు చేరడానికి సిద్ధమయ్యారు. ముందు ముందు ఈ చేరికలు పెరుగుతాయి.
అయితే ఇలాంటి వారందర్నీ పార్టీలో చేర్చుకోవడం వరకూ ఓకే కానీ టిక్కెట్లు ఇవ్వడంపై జనసేనాని ఆలోచించాల్సి ఉందన్న అభిప్రాయం వినిపిస్తోంది. దానికి ఉాదాహరణగా రాపాక వరప్రసాద్ ను చూపుతున్నారు. వైసీపీ టిక్కెట్ ఇవ్వకపోతే ఆయన జనసేనలో చేరారు. పార్టీ క్యాడర్ ఆయనను భుజాలపై ఎక్కించుకుని గెలిపిస్తే… పవన్ పైనే అసభ్యంగా తిట్టి జగన్ పంచన చేరారు. పార్టీ మారడం వేరు.. మారిన తర్వాత ఏ మాత్రం విలువ లేకుండా మాట్లాడం వేరు. ఇలాంటి నేతల్ని ప్రోత్సహించాల్సిన అవసరం ఉందా అన్నది కీలకం.
జనసేన బలానికి సొంత బలాన్ని జోడించి గెలిపించే లీడర్లు వస్తే.. వారికి టిక్కెట్ ఇవ్వడంతో తప్పు లేదని.. కానీ పార్టీ మీదనే ఆధారపడే వారిని… చేర్చుకుని సాధించేదేమీ ఉండదని చెబుతున్నారు. పంచకర్ల ఇప్పటి వరకూ జనసేన కోసం పని చేయలేదు. జనసేన కోసం నాలుగేళ్లుగా పని చేసిన వాళ్లు పెందుర్తిలో ఉన్నారు. అలాగే ఇతర నియోజకవర్గాల్లోనూ ఉన్నారు. అన్నీ ఆలోచించి పవన్ నిర్ణయాలు తీసుకోవాలని జనసైనికులు కోరుతున్నారు. విశ్వాసంగా ఉండే వారికే ప్రాధాన్యం ఇవ్వాలని.. వారిని గెలిపించుకుని తర్వాత తప్పు చేశామన్న భావన రాకుండా చేసుకోవాలంటున్నారు.